Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్య నిర్ణయం తీసుకుంటూ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని భావించడమే కాకుండా, ఆమె బర్తరఫ్ లేఖను గవర్నర్‌కు పంపినట్లు తెలిసింది. ఇదే సమయంలో తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డికి కూడా ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమించగా, తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద, కుడా (KUDA) చైర్‌పర్సన్‌గా మాజీ ఎంపీ గుండు సుధారాణిలను నియమించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
వివరణ అడగకుండానే బర్తరఫ్ చేశారు: ఎన్‌టీవీతో కొండా సురేఖ
తన బర్తరఫ్ నిర్ణయంపై కొండా సురేఖ ఎన్‌టీవీ (NTV) తో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం వివరణ అడగకుండానే తనను పదవి నుంచి తొలగించారని, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అన్ని విషయాలు వివరించినా తనను కావాలనే బలిచేశారని విమర్శించారు. రాజీనామా చేయమని తనను ఎవరూ అడగలేదని, తాను చేయలేదని స్పష్టం చేశారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనను ఎలా బాధ్యురాలిని చేస్తారని ప్రశ్నించిన ఆమె, అధిష్టానానికి తాను రాసిన లేఖను కూడా మీడియాకు విడుదల చేశారు.
టీడీపీ నేపథ్యం ఉన్నవారి కక్షపూరిత చర్య
ఈ నిర్ణయం వెనుక కక్షసాధింపు చర్యలు ఉన్నాయని కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో టీడీపీలో చంద్రబాబు నాయుడి వద్ద ఉన్నప్పుడు ఇటువంటి రాజకీయాలే చూశామని, సీఎం రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఇద్దరూ టీడీపీ నుంచి వచ్చినవారే కాబట్టి వారికి ఇది అలవాటేనని విమర్శించారు. సుమంత్ అనే వ్యక్తికి ఈ మొత్తం ఎపిసోడ్‌తో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. యూట్యూబ్‌లలో ఇతర మంత్రులపై ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించిన ఆమె, సీనియర్ నాయకుడైన చిన్నారెడ్డిపై కూడా చర్యలు తీసుకోవడం ఏమాత్రం సరికాదని మండిపడ్డారు.
నన్ను టార్గెట్ చేసి చిన్నారెడ్డిని బలి చేశారు
తనను టార్గెట్ చేయడానికి చిన్నారెడ్డిని బలిచేశారని, 80 ఏళ్ల వయస్సున్న ఆయనపై చర్యలు తీసుకోవడం సరికాదని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. తన వల్ల ముగ్గురు మహిళలకు పదవులు లభించాయని, వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు. కార్యకర్తలు, అభిమానులకు తమ గురించి పూర్తిగా తెలుసని, తమను కాకుండా పార్టీనే తప్పుపడతారని ఆమె అన్నారు. భవిష్యత్ కార్యాచరణపై తన వర్గీయులతో కూర్చుని మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని కొండా సురేఖ స్పష్టం చేశారు.

