Kodandaram Meeting With RRR Land Dwellers: టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్ మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) భూ నిర్వాసితుల సమావేశానికి హాజరైన ఆయన.. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ సరైనది కాదన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బంధువుల భూములను కాపాడటానికి భూమూల అలైన్‌మెంట్ చేస్తున్నారని ఆరోపించారు. బడా బాబుల భూములు కాపాడేందుకు.. టీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న సన్నకారు రైతుల పొట్టను కొడుతోందని ఆరోపణలు చేశారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.. ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారం ఏమాత్రం సరిపోదని పేర్కొన్నారు.
అంతకుముందు కూడా ఆర్ఆర్ఆర్ భూ నిర్వాసితులు చేపట్టిన ఆమరణ దీక్షకు కూడా కోదండరామ్ తన మద్దతు తెలియజేశారు. నిర్వాసితులతో కలసి కాసేపు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వం రైతుల నుంచి విలువైన భూముల్ని గుంజుకొని రోడ్డున పడేసిందని వ్యాఖ్యానించారు. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు శంకుస్థాపన రోజున హామీలిచ్చిన సీఎం కేసీఆర్.. వాటిని ఇప్పటివరకూ తీర్చలేదని మండిపడ్డారు. ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించడంతో పాటు.. మల్లన్న సాగర్ తరహాలో ఇంటికి 20 లక్షలు చొప్పున ఆర్&ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.
కాగా.. ఇటీవల గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించిన కోదండరామ్, తెలంగాణ కోసం అశువులు బాసిన కుటుంబాలతో పాటు పోరాడిన వారిని ఆడుకోవడానికి ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యమంలో వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లే ప్రభుత్వంలో ఉన్నారని మండిపడ్డారు.