మహిళల భద్రతపై, సమస్యలపై రోశయ్య హాయాంలో సమావేశం జరిగిందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ 8 ఏళ్లలో ఒక్కసారి కూడా సమావేశం పెట్టలేదని విమర్శించారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్. ప్రతిపక్ష నాయకులు ప్రగతి భవన్ కు ఎలా వచ్చారని సమీక్ష చేసుకుంటారు కానీ.. తెలంగాణలో మహిళలపై దాడి చేస్తే సమీక్ష ఎందుకు చేయరని ప్రశ్నించారు.
సీఎంకు తన భద్రత మీద ఉన్న శ్రద్ధ.. మహిళల భద్రతపై లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆయన గురించే ఆలోచిస్తున్నారు..ఆయన గురించే పరిపాలన చేసుకుంటున్నారని ఆరోపించారు. సీఎం, మంత్రులు వాళ్ల భద్రత మీదనే దృష్టి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారులు వాళ్ల కోసమే వాళ్లు అధికారాన్ని వాడుకుంటున్నారని.. ల్యాండ్, సాండ్ తప్ప వేరే లక్ష్యం లేదని.. ప్రజలు, ప్రజలు భద్రత, మహిళల భద్రత వారి దూరమైన అంశం అని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని.. వాళ్ల రాజకీయమే సొంత ప్రయోజనాల కోసమే నడుస్తోంది. వాళ్ల దృష్టి ప్రభుత్వం అనేది సొంత ఆస్తి అని.. ఆ ప్రభుత్వం అనే సొంత ఆస్తితో ఎలా ఆర్థికంగా ఎదగాలి, దోచుకోవాలనే ఆలోచనే తప్పితే ఇంకో ఆలోచన లేదని విమర్శలు గుప్పించారు. ఖచ్చితంగా మహిళల సమస్యలపై సమీక్ష సమావేశం జరగాల్సిందే అని.. బాధితులు ఎవరైనా, నిందితుల ఎంతటి వారైనా ఖచ్చితంగా న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.
నిజానికి ఎక్సైజ్ శాఖ అనేది తాగుడు పెంచే శాఖ కాదని.. తాగుడు తగ్గించే శాఖ అని కోదండరామ్ అన్నారు. ప్రభుత్వం తయారు చేసిందే తాగాలనే ధోరణి వచ్చిందని ఆయన అన్నారు. గవర్నర్ కు చెప్పినా ఏం లాభం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య ముచ్చట బంద్ అయ్యాక ఏం చేస్తాం అని అన్నారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో సీఎస్ ని కలుద్ధాం అని కోదండరామ్ అన్నారు. మద్యపాన నిషేధం కోసం ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. రేపటి తెలంగాణ ఎలా ఉండాలనే దానిపై కార్యాచరణ ఉండాాలని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఉండడని.. ఢిల్లీ పోతాడు పోనివ్వండి అని కోదండరామ్ కామెంట్స్ చేశారు.