Kishan reddy vs Harish rao: ఎంఎన్ జే కాన్సర్ ఆసుపత్రి నూతన బ్లాక్ ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ప్రస్తుతం ఓల్డ్ బ్లాక్ 450 బెడ్స్ ఉండగా, ఈ నూతన బ్లాక్ తో మరో 300 బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి. పీడియాట్రిక్ వింగ్, విమెన్ వింగ్, నర్సింగ్ కాలేజీ, బోన్ మ్యారో ట్రాన్సప్లాంటేషన్ కు ప్రత్యేక వార్డ్స్ ఏర్పాటు చేశారు. నూతన ల్యాబ్ ఫెసిలిటీస్, మరో రెండు ఆపరేషన్ థియేటర్స్ అందుబాటులోకి రానున్నాయి. 80 కోట్ల రూపాయలతో అరబిందో ఫార్మా బ్లాకుని నిర్మించడం జరిగింది. అయితే కార్యక్రమం జరుగుతుండగా మధ్యలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లిపోవడం చర్చకు దారితీసింది. కాగా.. కిషన్ రెడ్డి అనుచరులు మాత్రం ఆయనకు ఇతర కార్యక్రమాలు ఉండటంతో వెళ్లినట్లు చెబుతున్నారు. ఒక కేంద్ర మంత్రి అయి ఉండి ఇలా కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోవడం ఏంటని కొందరు మండిపడుతున్నారు.
మంత్రి హరీశ్ రావు
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వ ఆసుపత్రులకు csr నిధులు ఇవ్వడం ద్వారా వేలాదిమంది పేదలకు సేవ చేసిన వారు అవుతారని తెలిపారు. ప్రస్తుతం 750 పడకలకు ఎంఎన్ జి ఆసుపత్రి విస్తరించిందని తెలిపారు. దేశంలో ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్లో అత్యధిక బెడ్స్ తో రెండో స్థానంలో ఎంఎన్ జి నిలిచిందన్నారు. చిన్న పిల్లలకు 120 బెడ్స్ ఇందులో కేటాయించామన్నారు. నెలల తరబడి ఇక్కడ చికిత్స పొందే చిన్నారులకు ఇక్కడే పాఠాలు చెప్పే వెసులుబాటు కల్పించామని తెలిపారు. నిమ్స్ లో నెలకు 8 మందికి, ఎంఎన్ జి లో నెలకు 4 బోన్ మ్యారో క్యాన్సర్ చికిత్స అందిస్తున్నామన్నారు. ఇకపై ఎంఎన్ జిలో నెలకు 20 మందికి బోన్ మ్యారో ఉచిత చికిత్స అందిస్తామని తెలిపారు. 140 కోట్లతో ఎంఎన్ జి కార్పొరేట్ తరహా ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించామని హరీశ్ రావు అన్నారు.
దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉందని, రాబోయే ఒక ఏడాదిలో పది వేల పడకల ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. వైద్య విద్య పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించగా.. మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నారని తెలిపారు. 7వేల ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రంలో ఉన్నాయని, మొత్తం 35 మెడికల్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్నామని తెలిపారు. 800 కోట్లు క్యాన్సర్ చికిత్స కోసం ప్రభుత్వం ఖర్చు చేసిందని అన్నారు. 130 కోట్లు గత సంవత్సరం క్యాన్సర్ రోగులకు ఖర్చు చేశామని వివరించారు. కీమోథెరపీ, రేడియోథెరపీ సేవలను ఉచితంగా జిల్లాల్లో అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. 33 జిల్లాల్లో అవసాన దశలో ఉన్న క్యాన్సర్ రోగులకు ఆలన కేంద్రాలను నిర్మించామని మంత్రి తెలిపారు. క్యాన్సర్ ను ప్రాధమిక దశలో గుర్తించేందుకు టీ-డయాగ్నోస్టిక్స్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. క్యాన్సర్ ను అరికట్టాలంటే ప్రజల్లో చైతన్యం అవసరమని, ప్రజలు ఆహారపు అలవాట్లు, జీవన శైలిని మార్చుకోవాలని మంత్రి హరీశ్ రావ్ సూచించారు.
Srinivas Goud: టూరిజం హబ్ గా ట్యాంక్ బండ్