Kishan Reddy Interesting Comments On Bathukamma Celebrations: ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ‘కర్తవ్య పథ్’లో కేంద్ర ప్రభుత్వం ఘనంగా బతుకమ్మ వేడుకల్ని నిర్వహించింది. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం.. రాత్రి 8.30 వరకు కొనసాగింది. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. అంతకుముందే హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి తెలుగు మహిళలు మధ్యాహ్నం చేరుకొని.. బతుకమ్మలను అందంగా పూలతో పేర్చారు. సాయంత్రం ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మన ఆడబిడ్డల ఆత్మగౌరవమే బతుకమ్మ అని పేర్కొన్నారు. ఢిల్లీ గడ్డపై కర్తవ్య పథ్ వేదికగా ఈ సంబరాలు జరుపుకోవడంతో తెలంగాణకు మరింతగా ప్రత్యేకమైన గుర్తింపు దక్కిందన్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాల్లో భాగంగా.. ఏడాదిపాటు నిర్వహించే కార్యక్రమాల్లో ఈ బతుకమ్మని ఢిల్లీలో నిర్వహించినట్టు తెలిపారు. నాడు రజాకార్లు మన ఆడబిడ్డలను అవమానిస్తూ నగ్నంగా బతుకమ్మను ఆడించిన రోజుల నుంచి.. నేడు స్వేచ్ఛగా, ఉత్సాహంగా బతుకమ్మ ఆడుకునే అవకాశం దక్కడం వెనక ఎంతోమంది త్యాగాలతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యేకమైన చొరవ ఉన్నాయని తెలిపారు. తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయానికి సరైన గుర్తింపును కల్పించేందుకు ఢిల్లీ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో మమేకమై జీవించడం భారతీయ జీవన విధానమని.. అలాంటి ప్రకృతిని కాపాడుకుంటూ జీవనం సాగించాలన్నదే బతుకమ్మ సందేశమని అన్నారు.
కాగా.. ఈ వేడుకల్లో కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్, జల రవాణా మార్గాల మంత్రి సర్బానంద్ సోనోవాల్, పీఎంవో, సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, టూరిజం శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి, కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సతీమణి, కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సతీమణితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.