కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సికింద్రాబాద్‌లో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. తెలంగాన రాష్ట్రం దివాళా దిశగా సాగుతోందని ఆరోపించారు. హైదరాబాద్ నుంచి 80 శాతం ఆదాయం వస్తోన్నా.. అభివృద్ధి మాత్రం శూన్యమని అన్నారు. పేదలు నివసించే ప్రాంతాల్లో రోడ్లన్నీ గతుకులమయంగా ఉన్నాయని.. జీహెచ్‌ఎంసీ, జలమండలి ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితిలో తెలంగాణ సర్కార్ ఉందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలనతో ప్రజలో విసిగిపోయారన్న ఆయన.. ఎనిమిదేళ్ళ మోదీ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు అందుతున్నా.. తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు నిధులు రావడం లేదని రాష్ట్ర మంతులు దుష్ప్రచారం చేస్తున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజు కూడా పాల్గొనని నేతలంతా ఇప్పుడు సీఎం కేసీఆర్ పక్కనే ఉండి బీజేపీపై విమర్శలు చేస్తున్నారన్నారు. బీజేపీపై కేసీఆర్ కుటుంబం విషప్రచారం చేస్తోందని, అయినా ప్రజలు టీఆర్‌ఎస్‌ను నమ్మడంలేదని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి పట్టంకట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. గత యూపీఏ పాలనలో అవినీతి కుంభకోణాలే ఎక్కువగా వెలుగుచూశాయని, మోదీ గద్దెనెక్కాక అవినీతి మచ్చలేకుండా దేశాన్ని పురోభివృద్ధికి తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మోదీ, అమిత్‌షాల సారథ్యంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.