Site icon NTV Telugu

AI Fake Video Call: ఏఐ టెక్నాలజీతో చంద్రబాబు పేరుతో ఫేక్‌ వీడియో కాల్.. టీడీపీ నేతలకు బురిడీ..!

Ai Fake Video Call

Ai Fake Video Call

AI Fake Video Call: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో ఏఐ టెక్నాలజీతో నకిలీ వీడియో కాల్స్ ద్వారా తెలంగాణలోని పలువురు టీడీపీ నాయకుల వద్ద నుండి నగదును కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన కంచర్ల సతీష్ అనే టీడీపీ నాయకుడికి కొద్ది రోజుల క్రితం దేవినేని ఉమా పీఏ అంటూ ఫోన్ కాల్ వచ్చింది. తను దేవినేని ఉమా పీఏ అని కాసేపటిలో సార్ మీకు వీడియో కాల్ చేస్తారని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. అన్నట్టుగానే కొద్దిసేపటికి సతీష్ కు దేవినేని ఉమా ఏఐతో నకిలీ వీడియో కాల్ చేసి తెలంగాణలో టీడీపీ కార్యకర్తల పిల్లల చదువులకు సాయం చేయాలంటూ ఆ డబ్బును మూడు ఫోన్ పే నెంబర్లకు కొట్టాలని సూచించారు. అయితే, ఇదంతా నిజమేనని నమ్మిన సతీష్ 35 వేల రూపాయలు ఎకౌంట్ కి సెండ్ చేస్తారు. ఆ తరువాత ఈనెల 7వ తేదీన మరల దేవినేని ఉమా పేరుతో అదే వ్యక్తి నకిలీ వీడియో కాల్ చేశాడు.. మీతో చంద్రబాబు మాట్లాడతారని చెబుతాడు. కాసేపటికి వీడియో కాల్ లో ఏఐ చంద్రబాబు.. సతీష్ తో మాట్లాడతాడు. నమస్కారం అమ్మ.. భోజనం చేశారా లేదా.. నార్మల్ కాల్ లో మాట్లాడతాను అంటూ వీడియో కాల్ ను ముగిస్తారు.

Read Also: Post Office Scheme: ఏడాదికి కేవలం రూ.755లకే ప్రీమియం.. రూ.15 లక్షల ప్రయోజనాలు

ఇక, ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేసి అమరావతి వస్తే చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ బీఫాంలో ఇప్పిస్తానని చెబుతాడు. విజయవాడలో హోటల్లో దిగమని సలహా ఇస్తాడు. అయితే, ఇదంతా నిజమే అని నమ్మిన సతీష్.. స్నేహితులతో కలిసి విజయవాడ కు వెళ్లి హోటల్ లో దిగుతాడు. అప్పుడు మళ్లీ ఆ వ్యక్తి మరోసారి వీడియో కాల్ చేసి చంద్రబాబు వద్దకు ఎనిమిది మందికి మాత్రమే అనుమతి ఉందని ఒక్కొక్కరికి పదివేలు ఇవ్వాలని చెపుతాడు. దీంతో సతీష్ కు అనుమానం వస్తుంది. ఈ క్రమంలోనే హోటల్స్ సిబ్బంది భోజనాల బిల్లు కట్టాలని పట్టు పడటంతో వారితో గొడవపడతారు. హోటల్ సిబ్బంది సమాచారంతో పోలీసులు అక్కడి చేరుకుంటారు. ఎందుకు హోటల్ కు వచ్చాడు అని సతీష్ అతని స్నేహితులను పోలీసులు ప్రశ్నించడంతో విషయం వెలుగు చూస్తుంది. దీంతో పోలీసులు దేవినేని ఉమాకు ఫోన్ చేయటంతో అసలు విషయం బయటం పడింది. తానెవరికి ఫోన్ చేయలేదని దేవినేని ఉమా పోలీసులకు వివరణ ఇవ్వటంతో సతీష్ మోసపోయినట్లు గ్రహిస్తాడు. Ai జెనరేటెడ్ వీడియోలతో ఈ విధంగా నకిలీ వీడియోలను సృష్టించి ఏపీ సీఎం చంద్రబాబు పేరుతో తెదేపా నాయకుడిని మోసం చేయటం స్థానికంగా కలకలం రేపింది..

Exit mobile version