ఎత్తేసిన ధర్నా చౌక్‌లోనే కేసీఆర్ ధర్నా చేశారని మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ సందర్భంగా వరి కొనుగోలు అంశం పై కాంగ్రెస్ నిర్వహిస్తున్న ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ అన్ని తప్పుడు మాటలు చెబుతున్నారన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో పూటకో మాట మారుస్తున్నాడని ఆయన ఆరోపించారు. గన్ని బ్యాగులు లేవు. హామాలీల సమస్యలు పరిష్కారం కాలేదు. ఇవేవి పట్టకుండా కేసీఆర్ తన స్వంత పనులు చక్కబెట్టుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికే రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా రాష్ర్ట ప్రభుత్వాని సోయి లేదన్నారు.
తెలంగాణ మంత్రులు, ముఖ్య మంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిమగ్న అయ్యారని ఎద్దేవా చేశారు. మంత్రులకు పదవులమీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదన్నారు. రైతులను తీవ్ర సంక్షోభంలోకి కేసీఆర్ సర్కార్ నెట్టివేసిందన్నారు. పంటలు పండించే విషయంలో ప్రభుత్వ జోక్యం వలన రైతులు అయోమయ స్థితిలోకి వెళ్లారన్నారు. వరి కుప్పలపై రైతుల ప్రాణాలు పోతున్నా.. కేసీర్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తూ చోద్యం చూస్తుందన్నారు. రైతులను గాలికి వదిలేశారన్నారు. వడ్లుకొనే నాధుడు లేడు, వర్షానికి తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, మొలకలు వచ్చినా ధాన్యాన్ని కూడా కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు.