తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకూ మారుతున్న పరిణామాలు , మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై సాగుతున్న ప్రచారాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి , కేసీఆర్ భద్రతపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరంగా వెల్లడించారు. ప్రతిపక్ష నేతలను గౌరవించడం కాంగ్రెస్ సాంప్రదాయమని స్పష్టం చేశారు.
ప్రతిపక్ష నేతలకు గౌరవం ఇవ్వడమే కాంగ్రెస్ సంస్కృతి
గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి, జైపాల్ రెడ్డి వంటి ఎంతో మంది సీనియర్ ప్రతిపక్ష నాయకులు అనారోగ్యానికి గురైనప్పుడు నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా వారికి పూర్తి సహకారాన్ని అందించాయని మహేష్ కుమార్ గౌడ్ గుర్తుచేశారు. విభేదాలు రాజకీయంగానే ఉంటాయి తప్ప, ఎవరి ఆరోగ్యం విషయంలోనూ కాంగ్రెస్ దిగజారుడు రాజకీయం చేయదని అన్నారు. కేసీఆర్ అనారోగ్యానికి గురైన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి, గ్రీన్ ఛానెల్ కేటాయించి అత్యవసర వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. కేసీఆర్ భద్రత కోసం ప్రభుత్వం 52 మంది పోలీసులతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిందని వివరించారు.
సొంత కుటుంబంలోనే వివాదాలు… వీడియో క్లిప్ ప్రదర్శన
ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబంపై పీసీసీ చీఫ్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఆరోగ్యం క్షీణించాలని సొంత కుటుంబ సభ్యులే కోరుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. దీనికి బలం చేకూర్చేలా కేసీఆర్ కుమార్తె కవిత గతంలో చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్‌ను మీడియాకు ప్రదర్శించారు. హరీష్ రావుపై క్షుద్ర పూజల ఆరోపణలు చేస్తూ కవిత మాట్లాడిన వీడియోను చూపిస్తూ, బీఆర్‌ఎస్ కుటుంబంలో అంతర్గత పూజలు, వివాదాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రజలు గమనించాలని సూచించారు.
పిండ ప్రదానం ఘటనలపై ఖండన
కాంగ్రెస్ నేతల చిత్రపటాలకు బీఆర్‌ఎస్ శ్రేణులు పిండ ప్రదానం చేయడం వంటి చౌకబారు చర్యలను మహేష్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఆవేశంలో కొన్ని వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని, అంతేకానీ ఎవరికీ చెడు జరగాలని తాము ఎన్నడూ కోరుకోమని స్పష్టం చేశారు. అలాగే ఇటీవల జరిగిన దళిత సంఘాల నిరసనలపై స్పందిస్తూ, అది వారి సొంత ఆవేదనతో చేసిన ఆందోళన మాత్రమేనని, ఆ నిరసనలకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

