KCR Family Have Main Role In Every Scam Says Bandi Sanjay: తెలంగాణ రాష్ట్రంలో ఏ అవినీతి స్కామ్ జరిగినా.. అందులో కేసీఆర్ కుటుంబం పాత్ర ఉంటుందని తెలంగాణ బీజేనీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. లిక్కర్ స్వాంలో కేసీఆర్ కుటుంబంపై దేశం మొత్తం చర్చ జరుగుతోందని వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ ఏ మతాన్ని కించపరచలేదని, తాను ధర్మం కోసం పని చేస్తున్నానని అన్నారు. సీఎం కేసీఆర్ ఎంఐఎం కొమ్ము కాస్తున్నారని ఆరోపణలు చేశారు. గోషామహల్‌లో అరెస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తల్ని వెంటనే విడుదల చేయాలని.. లేకపోతే డీజీపీ ఆఫీస్ ముట్టడికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉందన్న ఆయన.. ఒక్కసారి బీజేపీ అవకాశం ఇవ్వండి ప్రజల్ని కోరారు. కాగా.. 8వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర, ఉప్పల్ నియోజకవర్గం నుంచి చిలకనగర్‌లోకి ప్రవేశించింది. అక్కడ ఆయనకు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
అంతకుముందు ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు కూడా.. సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే.. కేసీఆర్ పురుగులు పడి పోతాడని శాపనార్థాలు పెట్టారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో కలిసి ద్రౌపది ముర్మును ఓడించేందుకు ప్రయత్నించిన కేసీఆర్.. ఎస్టీల గురించి మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. సీఎంను ఎస్టీలు ఏమాత్రం నమ్మరన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరుపెట్టిన కేసీఆర్… కొత్త సచివాలయంలో ఒక కుర్చీ వేసి, దళితుడ్ని సీఎంగా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పట్టించుకోని ఏకైక సీఎం కేసీఆరేనని ఆరోపించిన ఆయన.. తడిగుడ్డతో గొంతు కోసే మూర్ఖుడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కుంభకోణం సహా అన్ని స్కాంలలో కేసీఆర్ కుటుంబం ఉందన్నారు. సీబీఐ అంటే చాలు వారికి కాలు విరుగుతుంది, ఈడీ అంటే కరోనా వస్తుంది అని బండి సంజయ్ సెటైర్లు వేశారు.