ఎవరు కొన్నారో?ఎవరి చేతుల్లో పెరిగి పెద్దదయిందో?ఎక్కడ బస్సు ఎక్కిందో?.. కానీ ఇప్పుడు ఆ కోడి కరీంనగర్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. ఆర్టీసీ అధికారుల చేతికి చిక్కిన ఆ కోడి.. తిరిగి ఎవరి వద్దకు చేరుతుందో అన్నది కూడా సస్పెన్స్ గానే మిగిలింది. దానిని చేజికించుకున్న వారు పందెం కోడిగా బరి గీసి కొట్లాడేందుకు తలకు కత్తి కడతారా లేక మెడపై వేటు వేస్తారా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఆర్టీసీ అధికారులకు చిక్కిన పందెంకోడిని వేలం వేసేందుకు అధికారులు సమయం నిర్ణయించారు.
Read Also: Ram Mandir: రామ మందిర వేడుక రోజున అయోధ్యకు 100 చార్టర్డ్ విమానాలు..
కరీంనగర్లో కోడిపుంజు వేలం కథ ఆసక్తికరంగా మారింది. గత 4 రోజుల క్రితం ఓ ప్రయాణికుడు వరంగల్ నుండి వేములవాడకు వెళ్లే ఆర్టీసీ బస్సులో కోడి పుంజును మరిచిపోయాడు. అయితే దానిని.. కరీంనగర్ బస్టాండ్ కు రాగానే బస్సు డ్రైవర్ గుర్తించి సంచిలో ఉన్న కోడిపుంజును కంట్రోల్ కు అప్పగించాడు. అప్పటినుంచి ఆ పందెంకోడిని కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని ఆర్టీసీ 2 డిపో ముందు అధికారులు తాడుతో కట్టి సంరక్షిస్తున్నారు.
ఆ కోడి సుమారు 6 కిలోల వరకు ఉంటుందని ఆర్టీసీ డిపో అధికారులు తెలిపారు. అయితే కోడిపుంజు కోసం దానికి సంబంధించిన తాలుకు ఎవరైనా వస్తారని గత నాలుగు రోజులుగా డిపోలో ఓ జాలీలో పుంజును బంధించారు. కాగా.. పుంజు కోసం ఎవరూ రాకపోవడంతో రేపు మధ్యాహ్నం 3 గంటలకు కోడిపుంజు బహిరంగ వేలం వేయనున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. అంబేద్కర్ బస్టాండ్ ఆవరణలో కరీంనగర్ -2 డిపో పరిధిలో బహిరంగ వేలం నిర్వహించబడును. కావున ఆసక్తి గలవారు బహిరంగ వేలంలో పాల్గొనగలరని తెలిపారు. అయితే.. ఇప్పుడు కోడిపుంజు వేలంకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Rajnath Singh: గల్వాన్‌తో భారత్ ఏంటో చైనాకు తెలిసొచ్చింది..