Rajnath Singh: చైనాను ఉద్దేశించి భారత్ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూకే పర్యటనలో ఉన్న ఆయన అక్కడ మీడియాలో మాట్లాడుతూ.. 2020 గల్వాన్ ఘటన తర్వాత భారత్ ఏంటో చైనాకు అర్థమైందని అన్నారు. భారత్ ఇప్పుడు వ్యూహాత్మకంగా ఉందని, బలహీనమైన దేశం కాదని చెప్పారు. భారత దేశాన్ని ఎవరూ భయపెట్టి తప్పించుకోలేరని అన్నారు.
Read Also: Ram Mandir: రామ మందిర వేడుక రోజున అయోధ్యకు 100 చార్టర్డ్ విమానాలు..
ఇటీవల చైనా మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్‌లో భారత్ గురించి వచ్చిన కథనం ‘ వాట్ ఐ సీ ఎబౌట్ భారత్ నేరేటివ్ ఇన్ ఇండియా’లో దేశాభివృద్ధి గురించి ప్రశంసించారు. భారతదేశ విదేశాంగ విధానంలో మార్పులను గురించి ప్రస్తావించింది. ప్రపంచంలో కీలక శక్తిగా భారత్ ఎదుగుతోందని, ఇండియా ప్రపంచంలో కీలకంగా ఉందని చైనా అంగీకరించింది. దీని గురించి ప్రస్తావించిన రాజ్ నాథ్ సింగ్.. భారత్‌పై మారుతున్న చైనా దృక్పథాన్ని తెలియజేస్తుందని అన్నారు.
గల్వాన్ వద్ద చైనా దళాలతో మన జవాన్లు చూపిన ధైర్యం భారత్‌పై బీజింగ్ దృక్ఫథాన్ని మార్చడంలో సాయపడిందని తాను నమ్ముతున్నట్లు రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఇప్పుడు భారత్ బలహీన దేశం కానది, ప్రపంచ వ్యాప్తంగా ఎదుగుతున్న దేశమని చెప్పారు. మేము ఎవరినీ శత్రువుగా చూడమని, కానీ భారత్-చైనా మధ్య సంబంధాలు ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నాయని ప్రపంచానికి తెలుసు.. అయితే భారత్ తమ పొరుగు దేశాలతో, ప్రపంచ దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటోందని ఆయన అన్నారు.