Kalvakuntla Kavitha Satires On BJP: తెలంగాణ వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత బీజేపీకి బుద్ధి వచ్చిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడిన ఆమె.. సీఎం కేసీఆర్ దెబ్బకు ఢిల్లీలోని ‘గెట్ వే ఆఫ్ ఇండియా’ దగ్గర బతుకమ్మ వెలుగుతోందని అన్నారు. గతంలో ఎప్పుడూ గుర్తు రాని బీజేపీకి ఎనిమిదేళ్ల తర్వాత విమోచన దినం గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. బీజేపీ ఆ విమోచన వినోత్సవంతో పాటు బతుకమ్మ జరుపుతోందంటే.. అదంతా కేసీఆర్ గొప్పతనమేనని అన్నారు. ‘తెలంగాణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో విమోచనం అంటున్నారు, అదే గుజరాత్‌లో పటేల్ విగ్రహం పెట్టి స్టాచ్యు ఆఫ్ యూనిటీ అంటున్నారు.. అసలు బీజేపీకి విభజన కావాలా? లేక యూనిటీ కావాలా? తేల్చుకోవాల’ని కవిత పేర్కొన్నారు. ఇవాళ ఢిల్లీలో బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయంటే.. దాని వెనుక కేసీఆర్ ఉన్నారని చెప్పారు.
కాగా.. బతుకమ్మ వేడుకల్లో కల్వకుంట్ల కవిత బొడ్డెమ్మను పూజించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఏర్పాటు చేసిన ఈ సంబరాల్లో పాల్గొన్న ఆమె.. ఆడబిడ్డలతో కలిసి ఆడిపాడారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఆడబిడ్డలందరికీ మన పండుగ అయిన బతుకమ్మను కాపాడుకోవాలని ఆలోచన ఏర్పడిందని అన్నారు. తన మనసుకు అత్యంత దగ్గరైన పండుగ ఇదని, రోజంతా కష్టాలను మరిచిపోయి అందరితో కలిసి సంతోషంగా ఆడి పాడే పండుగ బతుకమ్మ అని అన్నారు. మన చుట్టుపక్కల దొరికే పువ్వులనే దేవుడిగా కొలిచే పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. తాను 8 ,9 తరగతి వరకు చదువుకునే రోజుల్లో.. తమ ఊరికెళ్లి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నానని నాటి గుర్తుల్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు స్కూల్‌లో చదువుకునే పిల్లలు సైతం బతుకమ్మ పాటలు నేర్చుకుని.. సంప్రదాయంగా, గర్వంగా బతుకమ్మ ఆడే పరిస్థితి వచ్చిందని కవిత అన్నారు.