నీళ్లు, నిధులకెడ్చిన తెలంగాణ కోసం పట్టుదలతో ముందుకొచ్చిన నేత కేసీఆర్ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల మద్దతుతో కేసీఆర్ తెలంగాణ సాధించారని ఆమె అన్నారు. సత్యం చెప్పి ఉద్యమం చేశారు.. నిజం చెబుతూనే రాష్ట్ర అభివృద్ధి చేశారని ఆమె తెలిపారు. ఏం చేస్తామో అదే చెప్పడం కేసీఆర్ నైజమని ఆమె పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు పేలినప్పుడు.. మనం చేసిన అభివృద్ధి పనులను చెప్పి సమాధానం ఇవ్వాలని ఆమె కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న పనులను తెలుసుకోవాలని ఆమె సూచించారు.
కరోనా సమయంలోనూ టీఆర్‌ఎస్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదని ఆమె స్పష్టం చేశారు. మనం రైతులకు అన్నం పెడితే.. మోదీ సున్నం పెడుతున్నారని ఆమె ఆరోపించారు. మోటర్లకు మీటర్లు పెడతామని మోదీ అంటే.. ఇక్కడ ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడుతలేరని ఆమె విమర్శించారు. ఢిల్లీ అయినా, గల్లీ అయినా పేద ప్రజల తరపున గొంతెత్తేది టీఆర్‌ఎస్ మాత్రమేనని ఆమె వ్యాఖ్యానించారు.