Kadiyam Srihari: కేసీఆర్‌పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. వరంగల్‌ జిల్లాను 6 ముక్కలు చేసి ఆగమాగం చేశారంటూ..

  • కేసీఆర్‌పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
  • వరంగల్ జిల్లాకు గొప్ప రాజకీయ చరిత్ర ఉందని పేర్కొన్న కడియం శ్రీహరి
  • వరంగల్ జిల్లాను ఆరు భాగాలుగా విభజించి గందరగోళ పరిస్థితులు సృష్టించారని విమర్శ
Kadiyam Srihari

Kadiyam Srihari

స్టేషన్ ఘనాపూర్ మండలం మీదికొండలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తాను బీఆర్ఎస్‌లో ఉన్న సమయంలోనే అనేక అంశాలపై పార్టీ అధిష్ఠానానికి సూచనలు చేశానని, పలు విషయాల్లో విభేదించానని తెలిపారు. వరంగల్ జిల్లాకు గొప్ప రాజకీయ చరిత్ర ఉందని పేర్కొన్న కడియం శ్రీహరి, జిల్లాను ముక్కలుగా విభజించవద్దని అప్పట్లో సూచించానన్నారు. అయితే తన మాటను పట్టించుకోకుండా వరంగల్ జిల్లాను ఆరు భాగాలుగా విభజించి గందరగోళ పరిస్థితులు సృష్టించారని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే మేలు చేసిందని కడియం శ్రీహరి ఆరోపించారు. తెలంగాణ సాధనతో ఆ కుటుంబానికి అధికారం దక్కిందని, రాష్ట్ర సంపదను దోచుకోవడానికి, దాచుకోవడానికి తెలంగాణను వేదికగా మార్చుకున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణను ఆగం చేసింది కేసీఆర్ అని స్వయంగా ఆయన కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితే చెబుతున్నారని అన్నారు. కవిత చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్‌పైనే ఉందని పేర్కొన్నారు.

నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. అయితే గతంలో కేసీఆర్ ఇతర రాజకీయ పార్టీలకు చెందిన 36 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకుని, వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకపోయినా మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. “మీరు చేస్తే రాజకీయాలు, ఇతరులు చేస్తే వ్యభిచారమా?” అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతి, అహంకారం నచ్చకే తాను ఆయనకు, బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్నానని తెలిపారు. తాను దూరమవడం ఒకటైతే, సొంత కుమార్తె కవిత ఎందుకు దూరమైందో కూడా చెప్పలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారని కడియం శ్రీహరి విమర్శించారు. కాంగ్రెస్‌తో కలిసి నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని కడియం స్పష్టం చేశారు.