ఈ ప్రభుత్వం శంకుస్థాపన చేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప పనులు చేయడం లేదని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి… నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం గ్రామ సమీపంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.. నాగార్జునసాగర్ ఎడమ కాలువ సుమారుగా 60 సంవత్సరాలు అయ్యింది… కానీ, కాలువల భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.. పెద్దవూర మినీ గురుకుల పాఠశాలకు కనీస వసతులు లేని బిల్డింగ్‌లో ఏర్పాటు చేయడం సిగ్గుచేటుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మినీ గురుకుల పాఠశాల విద్యార్థులు సురక్షితంగా కాపాడిన పోలీసు అధికారులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. ఈ ప్రభుత్వం శంకుస్థాపన చేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప పనులు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Punjab: పీఎస్‌లోనే రివాల్వర్‌తో కాల్చుకుని ఏఎస్సై ఆత్మహత్య.. వీడియో రికార్డు చేసి మరీ..
మరోవైపు, కాలువ గండిపడి నష్టపోయిన రైతులకు తక్షణమే పంట నష్ట సహాయంగా 15,000 వేల రూపాయల నుండి 20,000 వేల రూపాయల వరకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు జానారెడ్డి… నిడమనూరు నర్సింగగూడెం గ్రామంలో ఇళ్లల్లో నీరు చేరిన బాధితులను ప్రభుత్వం తక్షణమే సహాయం చేయాలని కోరిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ నుండి ఇళ్లల్లో నీరు చేరుకున్న ఇబ్బంది పడుతున్న ప్రతి కుటుంబానికి.. వాళ్లు తిరిగి ఇళ్లలోకి వెళ్లే వరకు బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. కాగా, కృష్ణా నదిలో భారీ వరద కొనసాగుతోన్న నేపథ్యంలో.. ఎగువ ప్రాజెక్టుల్లో నీటిని విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. ఇక, సాగర్ నుంచి కూడా నీరు విడుదల చేస్తున్నారు.. అయితే, సాగర్ ఎడమ కాలువకు గండి పడి సమీప గ్రామాల్లోని పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా పలుచోట్ల భారీ పంట నష్టాన్ని మిగిల్చింది. చాలా మంది నిరాశ్రయులయ్యారు.. నిడమానూరు మండలం ముప్పారం 39వ కిలోమీటర్ వద్ద బుధవారం సాగర్ ప్రాజెక్టుకు గండిపడిన విషయం విదితమే..