Plant Paddy On Road: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలానికి చెందిన వెంకటాపూర్ గ్రామ రహదారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అక్కడ వర్షం చినుకు పడితే చిత్తడే అన్న మాట ఆ గ్రామానికి సరిగ్గా సరిపోతుంది. కాస్త వర్షం పడితే చాలు, ఊర్లోని రోడ్డు పూర్తిగా బురదమయం అయిపోతుంది. అక్కడి ప్రజలు వర్షాకాలంలో ప్రయాణించడం అంటే నిజంగా ప్రాణాలతో చెలాయించడం లాంటిదే అని చెప్పాలి. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా, అధికార పార్టీలు వచ్చి పోయినా ఆ గ్రామంలోని రోడ్డు మాత్రం మారట్లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. రోడ్లు వేస్తామని ఎన్నిసార్లు నాయకులు హామీలు ఇచ్చినా, వాటిని అమలు చేసే ప్రయత్నం మాత్రం కనపడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Viral News: రోజూ రాత్రి పక్క గది నుంచి వింత శబ్ధాలు.. తలుపులు తెరిచి చూసి పరుగులు పెట్టిన వ్యక్తి…
ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు తమ నిరసన తెలియజేసేందుకు వినూత్నమైన పద్ధతిని ఎంచుకున్నారు. వర్షంతో బురదగా మారిన రోడ్డుపైనే ఏకంగా వరి నాటు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఇంతకాలంగా రోడ్డు ఇలా ఉంటే, ఇక్కడ వ్యవసాయం చేసుకోవడమే మంచిదని భావించామని గ్రామస్తులు ఎద్దేవా చేశారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. ప్రజల వినూత్న నిరసనపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటారే లేదో అన్నది ఆసక్తికరంగా మారింది.