జగిత్యాల జిల్లాలో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. మేడిపల్లి మండలం దమ్మన్నపేటలో భారీ చోరీకి పాల్పడ్డారు. పొలం పనులకు వెళ్లి తిరిగొచ్చేలోపే 14 తులాల బంగారు ఆభరణాలు మాయం అయ్యాయి. వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న మహిళకు ఊహించని షాక్ తగిలింది. తాళం వేసి ఉన్న ఇళ్లు చోరికి గురికావడంతో లబోదిబోమన్నది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏనుగు పద్మ అనే మహిళ ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్లింది.
ఇదే అదునుగా భావించిన దుండగులు చోరికి పాల్పడ్డారు. ఇంటి తాళం పగలగొట్టి బెడ్ రూమ్ కబోర్డ్ లోని సుమారు 14 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి తిరిగివచ్చిన ఏనుగు పద్మ ఇంట్లో చోరి జరిగిందని గుర్తించింది. వెంటనే పోలీలసులకు సమాచారం అందించింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు చోరి జరిగిన తీరుపై వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కాగా మూడు రోజులుగా వరుసగా పలు మండలాల్లో చోరీలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం కథలాపూర్ మండలం ఉట్ పల్లి లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలో ఉన్న సుమారు 7 తులాల బంగారు ఆభరణాలు ఇద్దరు మాయ లేడీలు ఎత్తుకెళ్లారు. నిన్న కోరుట్ల బస్టాండ్ వద్ద ప్రయాణికురాలి పర్సును (4తులాల బంగారు ఆభరణాలు) గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కథలాపూర్ మండలంలో జరిగిన చోరీ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు ఇద్దరు మహిళలను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.