తెలంగాణలో త్వరలోనే పర్యటించనున్నారు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ.. ఆయన రెండు రోజుల పర్యటనలో భాగంగా.. రెండో రోజు ఉస్మానియా యూనివర్సిటీలో కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే, పోలీసుల నుండి కానీ, యూనివర్సిటీ వీసీ నుంచి గానీ ఇప్పటి వరకు అనుమతి లభించలేదు. అనుమతిపై తుది నిర్ణయం వీసీదేనని హైకోర్టు కూడా స్పష్టం చేసింది.. అయితే, రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ టూర్ కోసం సీఎం కేసీఆర్‌ను కలుస్తానని.. దాని కోసం అపాయింట్‌మెంట్ కోరతా అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
Read Also: KA Paul: నిన్నే పీకేతో మాట్లాడా.. కేసీఆర్‌కు వచ్చేవి 28 సీట్లే..!
రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు అనుమతి కోసం సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానన్నారు జగ్గారెడ్డి.. అపాయింట్‌మెంట్ కూడా కోరతా.. అపాయింట్‌మెంట్ ఇస్తే ఆయనను కలిసి అనుమతి కోరతా అన్నారు.. మరోవైపు.. మంత్రి ఎర్రబెల్లిపై ధ్వజమెత్తారు జగ్గారెడ్డి.. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అనేది తెలియని వ్యక్తి ఎర్రబెల్లి అని ఫైర్ అయ్యారు.. సమైక్య వాది అయిన దయాకర్ రావు… మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ని ఉరికించి కొడతా అని.. టీఆర్ఎస్‌లో చేరి మంత్రి అయ్యారని సెటైర్లు వేశారు. టీడీపీలో ఉన్నంత కాలం ఆయన మంత్రి కాలేదు.. ఇప్పుడు మంత్రి పదవి రావడం కూడా సోనియా గాంధీ దయతోనే అన్నారు. నువ్వో చిల్లర మంత్రివి.. నువ్వా రాహుల్ గాంధీపై మాట్లాడేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జగ్గారెడ్డి.