Cold in Telangana: తెలంగాణ రాష్ట్రంలో చలి వణికిస్తోంది. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్దిరోజులుగా చలి తీవ్రత కాస్త తగ్గిడంతో ఊపిరి పీల్చుకున్న రాష్ట్ర ప్రజలకు మళ్లీ చలి గజగజ వణికిస్తోంది. నిన్నటి నుంచి పగటి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత ఇంతకు ఇంతై నరాలను తెంచే విధంగా పెరుగుతుంది. నిన్నటి తో పోలిస్తే చలి ఇవాళ మరింతగా ఎక్కువైంది.
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని పట్టణాలు, గ్రామాలు పొగమంచు కమ్ముకున్నాయి. శనివారం ఉదయం 8 గంటల వరకు భానుడు కనిపించలేదు. రోజువారీ కూలీలు, విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై దట్టంగా మంచు కురుస్తుండటంతో వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. ఉదయం, సాయంత్రం చలి తీవ్రత పెరగడంతో ప్రజల రాక తగ్గింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయింది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉదయం ఎనిమిది గంటల వరకు మంచు కురిసింది. మంచు తెరల మధ్య సూర్యుడు నిండు చంద్రునిలా కనిపించినా.. చలికి జనం వణికిపోయారు. పొగ మంచు కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. నాలుగైదు అడుగుల దూరంలో ఉన్న మనిషి కనిపించని పరిస్థితి నెలకొంది. ఇళ్లు, పంట పొలాలను తెల్లటి తివాచీలా మంచు దుప్పటి కప్పి ఉంచడంతో పలువురు సెల్ ఫోన్లలో చిత్రాలు తీశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ లో 14.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టపూర్ లో 14.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. మెదక్ జిల్లా శంకరంపేటలో 16.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి మెదక్ జిల్లాను కమ్మేసిన పొగ మంచు కమ్మేసింది. దట్టంగా అలుముకోవడంతో.. మంచు దుప్పటి కమ్ముకుంది. పొగమంచు కారణంగా గ్రామాలు ఊటీని తలపిస్తుంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కనుచూపు మేరలో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడంలేదు. వాహనాలకు లైట్లు వేసుకుని వాహనదారులు ప్రయాణం చేస్తున్నారు.