తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల పాలిట నిమిషం నిబంధన శాపంగా మారింది. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం రోజే.. పలువురు విద్యార్థులకు తీవ్ర నిరాశ ఎదురైంది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు రావడం ఆలస్యమైందని పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతించలేదు అధికారులు. దీంతో తమను అనుమతించాలని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంత బ్రతిమిలాడిన పరీక్షా కేంద్రంలోకి అనుమతించక పోవడంతో.. విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు.
వేములవాడలో ఇద్దరిని, నిజామాబాద్‌లో 10 మంది విద్యార్థులు ఆలస్యంగా వచ్చారని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు. దీంతో పలు చోట్ల అధికారులతో విద్యార్థుల తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. అటు ఏపీలోనూ.. నిమిషం నిబంధనతో పలువురు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంకటగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రానికి ఓ విద్యార్థినీ 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. దీంతో అధికారులు ఆమెను లోనికి అనుమతించకపోవడంతో.. కన్నీళ్లు పెడుతూ.. అధికారులను బ్రతిమిలాడేసరికి.. అధికారులు లోనికి అనుమతించారు.