If KCR Hails Modi Then Cases On Telangana Will Be Dismissed Says CPI Narayana: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి కేంద్రంలో ఉన్న బీజేపీపై ఉక్కుపాదం మోపారు. తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది కాబట్టి.. ఆ పార్టీపై కేంద్రం దాడులు చేస్తోందని ఆరోపణలు చేశారు. ఒకవేళ ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ జై కొడితే.. రాత్రికి రాత్రే కేసులన్నీ మాయమవుతాయని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్‌లో శారద, నారద కేసుల్లో ఉన్నవాళ్లు.. బీజేపీలో చేరగానే ఏమైందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు, వ్యక్తులపై.. కేంద్రం ఏకపక్ష దాడులు జరుపుతోందని వ్యాఖ్యానించారు.
ఇక జీ-20కి భారత్ నాయకత్వం వహించడాన్ని సీసీఐ స్వాగతిస్తుందని నారాయణ అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా మహిళా బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. మహిళా బిల్లు ఆమోదించకుండా.. జీ-20లో మహిళా సాధికారతపై ఏం చర్చిస్తారు? అని ప్రశ్నించారు. ఈమధ్యే వెంకయ్యనాయుడు సైతం మహిళా బిల్లుని ఆమోదించాల్సిన అవసరం ఉందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళా బిల్లు ఆమోదానికి సీపీఐ పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. జీ-20లో పుష్పం గుర్తును లోగాగా పెట్టారని.. ఇది సంకుచిత స్వభావానికి నిదర్శనమని.. దీన్ని వెంటనే తొలగించాలని కోరారు.
బీజేపీకి వైసీపీ నుంచి ఎక్కువ మద్దతు లభిస్తోందని.. ఏపీలో వైసీపీ గెలిస్తే, బీజేపీ గెలిచినట్టేనని నారాయణ పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఎక్కువగా.. వైసీపీ నుంచే ఆ పార్టీకి మద్దతు దక్కుతోందన్నారు. టీడీపీని బలహీనపర్చడం కోసం పవన్ కళ్యాణ్‌ను బీజేపీ తమవైపు లాగుతోందన్నారు. మరి.. పవన్ కళ్యాణ్ ఎంతవరకు కలిసొస్తారో చూడాలని అన్నారు. మోడీకి మద్ధతిచ్చే వైసీపీకి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.