I Am Agent Of Sonia Gandhi Says Manickam Tagore: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తాను ఏజెంట్లా వ్యవహరిస్తున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాణిక్యం ఠాగూర్ స్పందించారు. తాను సోనియా గాంధీకి ఏజెంట్ని తప్ప, మరెవ్వరికీ ఏజెంట్ కాదని బదులిచ్చారు. తాను అధిష్టానానికి వారధినని అన్నారు. బీజేపీలో చేరిన నేతలే తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తనకు మంచి మిత్రుడని, ఇంటికి పిలిచి మరీ ఆయన తనకు మంచి బిర్యారీ పెట్టారన్నారు. ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పర్యటనకు వెళ్లిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను అరెస్ట్ చేయడంపై ఠాగూర్ మండిపడ్డారు. ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు.
అంతకుముందు మునుగోడుపై సమీక్ష నిర్వహించిన ఠాగూర్.. 20వ తేదీన మునుగోడు నియోజకవర్గంలో రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున నిర్వహించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. గాంధీ కుటుంబాల త్యాగాల గురించి పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. 20వ తేదీన కాంగ్రెస్ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి కలవాలని, శక్తివంతన లేకుండా కృషి చేయాలని అన్నారు. సెప్టెంబర్ 7వ తేదీన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభం అవుతుందని.. అక్టోబర్ చివరి వరకు తెలంగాణలో ఆయన పాదయాత్ర ఉంటుందని చెప్పారు. రాబోయే వంద రోజులు తమకు చాలా కీలకమని, ప్రతిఒక్కరూ శక్తి మేరకు పని చేయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే తమ లక్ష్యమని, ‘మన మునుగోడు మన కాంగ్రెస్’ అనే నినాదంతో ఇంటింటికి వెళ్లి విజయం దిశగా ముందుకు సాగాలని ఠాగూర్ వెల్లడించారు.