Site icon NTV Telugu

HYDRAA : హైడ్రా భారీ ఆపరేషన్.. మియాపూర్‌లో రూ. 3,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం..!

Hydra

Hydra

HYDRAA : హైదరాబాద్ నగరంలో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా (HYDRAA), మియాపూర్ ప్రాంతంలో అత్యంత విలువైన భూమిని కాపాడింది. మియాపూర్ విలేజ్ పరిధిలోని మక్తా మహబూబ్‌పేటలో సాగుతున్న భారీ కబ్జా యత్నాలను హైడ్రా అధికారులు భగ్నం చేశారు. తాజాగా చేపట్టిన ఈ ఆపరేషన్ ద్వారా సుమారు 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్ ధర ప్రకారం ఈ భూమి విలువ 3 వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా.

మియాపూర్ మక్తా మహబూబ్‌పేటలోని సర్వే నంబర్ 44 లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందని గతంలోనే ‘హైడ్రా ప్రజావాణి’కి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. నిజానికి గతంలోనే ఇదే సర్వే నంబర్‌లో ఉన్న 5 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. అలాగే మియాపూర్ – బాచుపల్లి ప్రధాన రహదారికి సమాంతరంగా ఉన్న చెరువు కట్టపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 18 షట్టర్లను కూడా అధికారులు గతంలోనే తొలగించారు.

Bhogi 2026: ఈ ఏడాది భోగి ఎప్పుడంటే..? భోగి మంటల అసలు విశిష్టత ఇదే.!

ఇటీవల మక్తా మహబూబ్‌పేట భూములకు సంబంధించి జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు, సంబంధిత సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ ఉదంతాల నేపథ్యంలో హైడ్రా మరోసారి లోతైన విచారణ చేపట్టింది. సర్వే నంబర్ 44 లోని సుమారు 43 ఎకరాల ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాల సాయంతో కబ్జా చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నట్లు అధికారులు నిర్ధారించుకున్నారు. ముఖ్యంగా సర్వే నంబర్ 159 కి చెందిన పత్రాలను చూపిస్తూ, సర్వే నంబర్ 44 లోని ఎకరన్నర ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ఇమ్రాన్ అనే వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదు చేశారు.

తాజా ఆపరేషన్లో భాగంగా స్వాధీనం చేసుకున్న 15 ఎకరాల భూమి చుట్టూ హైడ్రా అధికారులు పక్కాగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ భూమి అని, ఇక్కడ కబ్జాలకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ భారీ బోర్డులను ఏర్పాటు చేశారు. విలువైన భూమిని కాపాడటమే కాకుండా, అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించిన అధికారులపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో స్థానికంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

Tractor High Sales : చరిత్రలో తొలిసారి.. 10 లక్షల మార్కును దాటిన భారత ట్రాక్టర్ అమ్మకాలు!

Exit mobile version