Bhogi 2026: తెలుగు వారు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ప్రధానమైనది. ముచ్చటగా మూడు రోజుల పాటు జరిగే ఈ సంబరాల్లో మొదటి రోజైన ‘భోగి’కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే 2026 సంవత్సరంలో భోగి పండుగ ఏ తేదీన జరుపుకోవాలనే విషయంలో సామాన్యుల్లో కొంత సందిగ్ధత నెలకొంది. సాధారణంగా ప్రతి ఏడాది జనవరి 13న భోగి వస్తుంటుంది, కానీ ఈ ఏడాది గ్రహ గతులు , సౌరమాన గణాంకాల ప్రకారం తేదీలో మార్పు వచ్చినట్లు పంచాంగకర్తలు స్పష్టం చేస్తున్నారు.
అధిక శాతం మంది పండితులు , జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, 2026 సంవత్సరంలో సంక్రాంతి సంబరాలు జనవరి 14వ తేదీన ప్రారంభం కానున్నాయి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలాన్ని బట్టి పండుగ తేదీలను నిర్ణయిస్తారు. ఈ క్రమంలో జనవరి 14 (బుధవారం) భోగి పండుగను, జనవరి 15న మకర సంక్రాంతిని, జనవరి 16న కనుమ పండుగను జరుపుకోవాలని శాస్త్రం చెబుతోంది. జనవరి 13 మధ్యాహ్నం నుండే షట్తిల ఏకాదశి తిథి ప్రారంభమై, జనవరి 14 సాయంత్రం వరకు ఉండటం వల్ల 14వ తేదీనే భోగి వేడుకలు నిర్వహించుకోవడం ఉత్తమమని పండితులు సూచిస్తున్నారు.
భోగి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది తెల్లవారుజామున వేసే భోగి మంటలు. దక్షిణాయనంలో పేరుకుపోయిన పాత సామాన్లను, ఇంట్లోని పనికిరాని వస్తువులను అగ్ని దేవుడికి సమర్పించడం దీని వెనుక ఉన్న అంతరార్థం. అంటే బాహ్యంగానే కాకుండా, అంతర్గతంగా ఉన్న చెడు ఆలోచనలను వదిలేసి కొత్త జీవితానికి స్వాగతం పలకడమే ఈ మంటల ఉద్దేశ్యం. ఆధ్యాత్మికంగా భోగి మంటను అగ్నిహోత్రంతో సమానంగా భావిస్తారు. అందుకే ఆ మంటలు చల్లారిన తర్వాత వచ్చే భస్మాన్ని (బూడిదను) నుదుటిన ధరించడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని పెద్దల నమ్మకం.
భోగి పండుగతోనే నెల రోజుల పాటు సాగే ధనుర్మాస వ్రతం పూర్తవుతుంది. పురాణాల ప్రకారం, గోదాదేవి (ఆండాళ్ తల్లి) శ్రీరంగనాథుడిని పతిగా పొంది, స్వామిలో ఐక్యమైన రోజుగా దీనిని భావిస్తారు. అందుకే భోగి రోజున ఆలయాల్లో గోదా కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వివాహం కాని యువతులు ఈ కళ్యాణాన్ని తిలకించి, ఆ అక్షతలను తలపై వేసుకోవడం వల్ల శీఘ్రంగా వివాహం జరుగుతుందని, మంచి భర్త లభిస్తాడని బలీయమైన విశ్వాసం ఉంది. ఈ రోజున అభ్యంగన స్నానం ఆచరించి, ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు.
భోగి రోజు సాయంత్రం వేళ ఇంట్లోని చిన్న పిల్లలకు దిష్టి తగలకుండా రేగు పళ్లను (భోగి పళ్లు) తల మీదుగా పోస్తారు. రేగు పండును ‘అర్క ఫలం’ అని అంటారు, అంటే ఇది సూర్యుడికి ప్రతీక. ఈ పళ్లను పిల్లలపై పోయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం కలిగి వారికి ఆయురారోగ్యాలు లభిస్తాయని, దృష్టి దోషాలు తొలగిపోతాయని సంప్రదాయం చెబుతోంది. పాతను వదిలి కొత్తదనానికి స్వాగతం పలికే ఈ భోగి పండుగ, 2026 జనవరి 14న తెలుగు లోగిళ్లలో సరికొత్త వెలుగులు నింపాలని కోరుకుందాం.
Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !