TG High Court Serious: వీధికుక్కల దాడులపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అమాయకులపై కుక్కల దాడులు, వాటి నియంత్రణ చర్యలు సమావేశాలు, సూచనల తో సరిపెట్టకుండా సమగ్ర కార్యాచరణ అవసరమని తేల్చిచెప్పింది. జంతు పునరుత్పత్తి నియంత్రణ నిబంధనలను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీని, ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటితో పాటు గ్రేటర్ హైదరాబాద్ వెలుపల జంతు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. కుక్కకాటు, వీధికుక్కలపై ప్రజలు సంప్రదించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని, ఫిర్యాదులు అందిన వెంటనే కుక్కలను పట్టుకునేందుకు వాహనాలు 24 గంటలూ అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించింది.
Read also: Health insurance: రూ.5 లక్షల వైద్య బీమాతో రూ.50 లక్షల విలువైన చికిత్స!
వీటన్నింటిపై యాక్షన్ నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. కాగా.. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన ఎంఈ విక్రమాదిత్య వీధికుక్కలను నియంత్రించాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19న బాగంబెర్‌పేటలో కుక్కల దాడితో పాఠశాల విద్యార్థి మృతి చెందడంపై పత్రికల్లో వచ్చిన ఘటనను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించింది. ఈ పిటిషన్లపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
చేయాల్సిన పనులు ఇవే..
* ఏబీసీ నిబంధనల ప్రకారం జీహెచ్‌ఎంసీ, స్థానిక సంస్థలు తగిన షెల్టర్లు, పశువైద్యశాలలు, కుక్కలను తరలించేందుకు వ్యాన్‌లు, మొబైల్ ఆపరేషన్ థియేటర్, స్టెరిలైజేషన్ వ్యాన్‌లను ఏర్పాటు చేయాలి.
* ఆపరేషన్ తర్వాత జంతువులను ఉంచేందుకు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.
* స్థానిక సంస్థలు తమ సిబ్బందితో జంతు పునరుత్పత్తి నియంత్రణ కార్యక్రమాలను చేపట్టాలి.
* స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి ప్రాజెక్ట్ ఇన్ చార్జిని నియమించాలి.
* ఏబీసీ నిబంధనలలోని 11 ప్రకారం కుక్కలను పట్టుకుని స్టెరిలైజ్ చేసి వ్యాక్సిన్ వేయించి వదిలేయాలని, ఫిర్యాదుల ఆధారంగా వీధికుక్కలను పట్టుకోవాలని సూచించారు.
* స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ల కోసం పట్టుబడితే వాటిని పూర్తి చేసిన తర్వాత అక్కడే వదిలేయాలి, అయితే పునరావాసం కోసం పట్టుబడితే వదిలిపెట్టాల్సిన పనిలేదు.
SR Nagar Hostel: ఎస్ ఆర్ నగర్ లో హాస్టల్ లో డ్రగ్స్ కలకలం..