Group-1 Exam: గ్రూప్-1 పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య విషయంలో ఎలాంటి తేడా లేదన్నారు. నామినల్ రోల్స్, అభ్యర్థుల వేలిముద్రల ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడించినట్లు చెప్పారు. కోఠిలోని ఓ కేంద్రంలో పరీక్ష రాసిన వారే ఎక్కువ మంది ఎంపికయ్యారనేది అవాస్తవం.. అక్కడ ఉన్న రెండు పరీక్ష కేంద్రాలలో 1500 మంది అభ్యర్థులు మెయిన్స్ రాశారు.. మిగతా పరీక్షా కేంద్రాల్లో రాసిన వాళ్లలో అంతకంటే ఎక్కువ మందే ఎంపికయ్యారు అని పేర్కొన్నారు. కోఠిలోని రెండు కేంద్రాలు కేవలం మహిళలకు కేటాయించడంతో సౌకర్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నాం అన్నారు. ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థులు ఏవేవో అనుమానాలతో పిటిషన్లు దాఖలు చేశారు.. వారు చేస్తోన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవు కేవలం అపోహలు మాత్రమే ఉన్నాయని టీజీపీఎస్సీ తరపు అడ్వకేట్ నిరంజన్ రెడ్డి తెలిపారు.
Read Also: Gender Change: పెళ్లి కోసం లింగమార్పిడి చేసుకున్న వ్యక్తి.. చివరకు అత్యాచారం కేసు..
అయితే, గ్రూప్-1 పరీక్షకు ఎంపికైన తెలుగు మీడియం అభ్యర్థులు 9.95 శాతం, ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులు 89.88 శాతం, ఉర్దూ మీడియం 0.1 శాతంగా ఉన్నారని కోర్టుకు తెలిపారు సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి. ఏపీలో రెండేళ్ల క్రితం నిర్వహించిన ఏపీపీఎస్సీ పరీక్షల్లోనూ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు.. టీజీపీఎస్సీకి తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో అభ్యర్థుల పట్ల ఎలాంటి వివక్ష లేదు అని తేల్చి చెప్పారు. అందరికీ ఎక్ప్ పర్ట్ ఎంపిక చేసిన అంశాల ఆధారంగా మార్కులు వేశారని వెల్లడించారు. కాగా, ఇవాళ ప్రభుత్వం తరపున వాదనలు ముగిశాయి. తదుపరి పిటిషనర్స్ తరపున వాదనలు సోమవారం రోజున పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ తీర్పును వాయిదా వేసింది హైకోర్టు.