New Liquor Shops: తెలంగాణలోని 2,620 మద్యం షాపుల లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు నుంచి వచ్చే నెల (అక్టోబర్) 18వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీలు, గీత కార్మికులకు కేటాయించే దుకాణాలను జిల్లా కలెక్టర్లు గురువారం డ్రా పద్ధతిలో ఎంపిక చేసినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. దుకాణాలల్లో గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అక్టోబర్ 23వ తేదీన కొత్త దుకాణాల కేటాయింపునకు సంబంధించి డ్రా ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ డ్రాలో దుకాణాల లైసెన్స్ పొందిన వారు మొదటి వాయిదా మొత్తాన్ని అక్టోబర్ 23 నుంచి 24 మధ్య చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజు మొత్తాన్ని ఆరు విడతలుగా చెల్లించే అవకాశం కల్పించారు. డిసెంబర్ 1 నుంచి నూతన దుకాణాల లైసెన్స్ అమలులోకి వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్త మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది.
Read Also: Trump: సుంకాలపై మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. భారత్‌కు భారీ ఎఫెక్ట్
ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్స్‌ల గడువు ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుంది. గతంలో ఉన్న 2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫారం ధరను ఈసారి 3 లక్షలుగా నిర్ణయించారు. ఈ మొత్తం సొమ్ము నాన్ రిఫండబుల్‌గా ప్రభుత్వం పేర్కొంది. కొత్త లైసెన్స్ కాల పరిమితి 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. కొత్త మద్యం దుకాణాలకు ఆరు స్లాబుల కింద లైసెన్స్ ఫీజు నిర్ణయంచింది. 5 వేల జనాభా వరకు మద్యం దుకాణం లైసెన్స్ ఫీజు 50 లక్షలుగా నిర్ణయించారు. 5 వేల నుంచి 50 వేలు జనాభా వరకు మద్యం దుకాణం లైసెన్స్ ఫీజు 55 లక్షలు, 50 వేలు నుంచి 1 లక్ష జనాభా వరకు మద్యం దుకాణం లైసెన్స్ ఫీజు 60 లక్షలుగా నిర్ణయించారు. లక్ష నుంచి 5 లక్షల జనాభా వరకు మద్యం దుకాణం లైసెన్స్ ఫీజు 65 లక్షలుగా, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా వరకు మద్యం దుకాణం లైసెన్స్ ఫీజు 85 లక్షలుగా నిర్ణయించారు. 20 లక్షలు కంటే ఎక్కువ జనాభా ఉన్న మద్యం దుకాణం లైసెన్స్ ఫీజు కోటి 10లక్షల లైసెన్స్ ఫీజుగా నిర్ణయించారు. మొత్తానికి.. నోటిఫికేషన్ విడుదల కావటంతో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు మద్యం వ్యాపారులు.