బండి సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ ప్రజాస్వామ్య యుతంగా జాగరణ దీక్ష చేపట్టారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇది పతనానికి నాంది అని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే స్థానికత అంశం మీద అని, స్థానికతకు ఈ ప్రభుత్వం చరమ గీతం పాడిందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఉద్యమకారులను వదిలి ఉద్యమ ద్రోహులను దగ్గర చేర్చుకున్నాడని, మూడు సంవత్సరాలు నిద్రపోయిన ప్రభుత్వం మూడు రోజుల్లో అదరబదరగా ఉద్యోగ విభజన చేయాలని అనుకుందని ఆయన అన్నారు.
ఉద్యోగ సంఘాల నేతల నోళ్లు మూత పడ్డాయని, కోవిడ్ నిబంధనలు అధికార టీఆర్‌ఎస్ పార్టీ కి ఉండవా అని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘాతుకాలు చూడలేదని ఆయన అన్నారు. బీజేపీ కార్యకర్తల చేతులు, కాళ్ళు విరిగాయని, పోలీసుల దౌర్జన్యాలతో బీజేపీ బెదిరిపోదని ఆయన స్పష్టం చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో 333 సెక్షన్ లేదు… బెయిల్ వస్తుంది అని చివరలో 333 ని యాడ్ చేశారు… పాత కేసులన్ని పెట్టారు. గ్యాస్ కటర్, గడ్డపారలతో క్యాంప్ ఆఫీసు డోర్ లు కిటికీలు కమిషనర్ సమక్షంలో పగల గొట్టారు.. ఇదేనా ప్రజా స్వామ్యం. రాజకీయంగా, న్యాయ పరంగా పోరాడుతాం. బెంగాల్, కేరళ లాగా ప్రభుత్వమే హింసాత్మక సంఘటనలకు పాల్పడడం కరెక్ట్ కాదని లక్ష్మణ్ మండిపడ్డారు.