NTV Telugu Site icon

KTR: నేడు మహిళా కమిషన్ ముందుకు కేటీఆర్.. తీవ్ర ఉత్కంఠ..!

Ktr

Ktr

KTR: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇవాళ (శనివారం) రాష్ట్ర మహిళా కమిషన్‌ ముందు హాజరు కాబోతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు మహిళా కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. ఉదయం 11 గంటలకు ఆయన మహిళా కమిషన్‌ కార్యాలయానికి వెళ్లబోతున్నారు. కాగా, ఈ నెల 15వ తేదీన తెలంగాణ భవన్‌లో జరిగిన స్టేషన్‌ ఘన్‌పూర్‌ కార్యకర్తల మీటింగ్ లో కేటీఆర్, ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ మాట్లాడుతున్నా.. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద.. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఈ నెల 16న కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.

Read Also: Off The Record : పిన్నెల్లి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!

ఇక, తాను చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 16వ తేదీనే కేటీఆర్‌ క్షమాపణ చెప్పుకొచ్చారు. పార్టీ మీటింగ్ లో యథాలాపంగా చేసిన వ్యాఖ్యలతో మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు. నా అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదని ట్విట్టర్ (‘ఎక్స్‌’)లో కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే, మరుసటి రోజు కూడా తన వ్యాఖ్యలకు బేషరతు బహిరంగ క్షమాపణ చెప్పినట్లు మీడియా ప్రతినిధులకు తెలిపారు. కాగా, మహిళా కమిషన్‌ నోటీసుల మేరకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇస్తానని ప్రకటించారు. అదే టైంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కొల్లాపూర్, షాద్‌నగర్‌తో పాటు రాష్ట్రంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాల వివరాలను కూడా మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌కు అందజేస్తానని కేటీఆర్ వెల్లడించారు.