మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిలొచ్చినంత మాత్రాన ఆల్ హ్యాపీస్ కాదా? ఇన్‌ఫ్రంట్ దేరీజ్ క్రోకడైల్ ఫెస్టివల్ అంటున్నారా? వరుసబెట్టి వస్తున్న ఫిర్యాదులు ముందు ముందు మంట పుట్టించబోతున్నాయా? పిన్నెల్లి చుట్టూ పొలిటికల్ ఉచ్చు గట్టిగానే బిగుస్తోందా? అసలు మాచర్లలో ఏం జరుగుతోంది? మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితులమంటూ ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. భూ కబ్జాలు, బెదిరింపులపై ఫిర్యాదుల పరంపర పెరుగుతోంది. తమను బెదిరించి పిన్నెల్లి, ఆయన అనుచరగణం ఆస్తులు లాక్కున్నారని, వాళ్ళ అరాచకాల దెబ్బకు తట్టుకోలేక ఊళ్ళు వదిలి వెళ్ళిపోయామంటూ ఒక్కొక్కరే బయటికి వస్తున్నారు. అదే సమయంలో బాధితులంతా ఇప్పుడే ఎందుకు బయటికి వస్తున్నారు? అధికారం మారింది కాబట్టి వాళ్ళకు ధైర్యం వచ్చిందా? లేక అసలు కథ వేరే ఉందా అన్న చర్చ మొదలైంది నియోజకవర్గంలో. 2009 నుంచి మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి మీద రకరకాల ఆరోపణలున్నాయి. 2014లో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంత దూకుడు తగ్గించిన రామకృష్ణారెడ్డి ,2019 నుంచి ఇటీవల ఓడిపోయే వరకు చెలరేగారట. తాను వరుసగా నాలుగు సార్లు విజయం సాధించడంతో వచ్చిన పవర్‌ని పూర్తి స్థాయిలో చెలాయించారన్నది లోకల్ టాక్. కొన్ని సందర్భాల్లో టిడిపి కీలక నాయకుల్ని సైతం బెదిరించి నియోజకవర్గం నుంచి పంపేసి వాళ్ళ భూముల్ని ఆక్రమించారంటూ ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. ఇవే అంశాలను బాధితులు తాజాగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తున్నట్టు తెలుస్తోంది. పెట్రోల్ బంకు ఆక్రమించారని ఒకరు, భూమిని లాక్కున్నారని కొంతమంది, బెదిరించి తక్కువ ధరకే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఇంకొందరు… ఇలా వరుసబెట్టి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయట. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం జైల్లో, అతని సోదరుడు పరారీలో ఉన్నారు. నియోజకవర్గంలో ప్రస్తుతం వాళ్లకు మద్దతుగా మాట్లాడేవాళ్ళు కూడా లేరు.
దీంతో మెల్లిగా బాధితులు బయటికి వస్తున్నట్టు చెబుతున్నారు. దాదాపు 20ఏళ్ళ పాటు పిన్నెల్లి బ్రదర్స్ ఒక రకంగా మాచర్లను శాసించారు. లోకల్‌గా తాము చెప్పిందే జరగాలన్నట్టుగా ఉండేవారట. నాయకుడి అండ చూసుకుని మాజీ ఎమ్మెల్యే అనుచరగణం కూడా ఓ రేంజ్‌లో చెలరేగి పోయిందని, ఇప్పుడు ఆ కథంతా మారిపోయిందని అంటున్నారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో టీడీపీదే పవర్ అయినా… ఎక్కడా తొందరపడకుండా… దూకుడు ప్రదర్శించకుండా పిన్నెల్లిని చట్టప్రకారం ఉక్కిరి బిక్కిరి చేసే ప్రక్రియ మొదలైనట్టు కనిపిస్తోందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. సాధారణంగా అయితే… ఫ్యాక్షన్ ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో…నాయకుడు డ్యామేజ్ అవగానే… అతని బలమైన కేడర్‌ని చెదరగొట్టే పని చేస్తారు ప్రత్యర్థులు. కానీ ఇప్పుడు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాత్రం తన పంథా పూర్తిగా మార్చేసినట్టు కనిపిస్తోందట. కారణం ఏదైనా…. ఆయన వేచిచూసే ధోరణిలో ఉన్నట్టు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు పిన్నెల్లి మీద విరుచుకుపడ్డ జూలకంటి ఫలితాల తర్వాత మాత్రం కామ్ అయ్యారు. పిన్నెల్లి మీద ఒక్క నెగెటివ్ కామెంట్ కూడా చేయలేదు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే అనుచరగణాన్ని లాగేసే ప్రయత్నం జరుగుతోందట. అంటే నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలపై జనం స్వేచ్ఛగా మాట్లాడినా… ఎవరికీ ఎలాంటి ముప్పు తలపెట్టకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారా అన్న డౌట్స్ పెరుగుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. ప్రస్తుతం ఒక్కొక్కరుగా బయటికి వస్తున్న బాధితుల సంఖ్య ఇంకా పెరుగుతుందని, అదంతా కొలిక్కి వచ్చాక మాజీ ఎమ్మెల్యే అరాచకాలపై దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని నియమించే అవకాశం ఉందన్న చర్చ సైతం జరుగుతోంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పలువురు టీడీపీ నేతలు కూడా సిట్ అంశాన్ని ప్రస్తావించారు. ఒకేసారి ప్రతీకార చర్యలకు దిగకుండా… ముందు బాధితులంతా స్వేచ్ఛగా బటికి వచ్చి ఫిర్యాదులు చేయగలిగే వాతావరణం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. తర్వాత పిన్నెల్లి చుట్టూ లీగల్ నట్లు ఆటోమేటిక్‌గా బిగుసుకుపోతాయన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరూ నియోజకవర్గంలో లేకపోవడంతో స్వేచ్ఛగా ఫిర్యాదులు చేస్తున్నారని, ఈ వాతావరణాన్ని ఇలాగే ఉండనివ్వాలన్నది టీడీపీ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే ఎమ్మెల్యే జూలకంటి కూడా సైలెంట్‌గా ఉంటున్నారని, ఇది తుఫాన్ ముందు ప్రశాంతత కావచ్చని అంటున్నారు కొందరు. మొత్తంగా పిన్నెల్లి విషయంలో ఇప్పుడే ఏం కాలేదు, ఇన్‌ఫ్రంట్ దేరీజ్ క్రోకడైల్ ఫెస్టివల్ అన్న టాక్ మాత్రం బలంగా నడుస్తోంది మాచర్లలో.