టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ వేదికగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి సవాల్ విసిరారు. మంగళవారం ఉదయం తెలంగాణ భవన్ లో జర్నలిస్టులతో కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ఉద్ఘాటించారు. అంతేకాకుండా బీజేపీ, కాంగ్రెస్ కుమ్మకై హుజురాబాద్ లో రాజకీయం చేస్తున్నాయన్నారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ చేశారు.
సంస్థాగత నిర్మాణంలో భాగంగా కమిటీలు ఏర్పాటు అయ్యాయన్నారు. టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ ను నామినేట్ చేస్తూ ఇప్పటి వరకు 10 సెట్ల నామినేషన్‌లు దాఖలు అయ్యాయని తెలిపారు. 16,395 టీఆర్ఎస్ పార్టీ యూనిట్లు ఉన్నాయని, ప్రతి కమిటీ కూడా తెలంగాణ విజయ గర్జనకు తరలిరావాలని పిలుపునిచ్చారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వరంగల్ మాకు మొదటి నుంచి కలిసి వచ్చిన నగరం, నవంబర్ 15 న మేము ఎక్కువగా ఆర్టీసీ బస్సులు తీసుకుంటున్నాము. ఆ రోజు ప్రజలు మాకు సహకరించాలి. ప్రయాణాలు వద్దు. వాయిదా వేసుకోండి. అసౌకర్యం కు చింతిస్తున్నాం అని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్, వరంగల్ స్థలం ఖరారు కాలేదు. మిగతా చోట్ల పార్టీ కార్యాలయాలు ప్రారంభం, పార్టీ శిక్షణ కార్యక్రమాలు మొదలు పెడతామని వెల్లడించారు.
ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల పాటు పార్టీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇరవై ఏళ్లుగా పార్టీ విజయవంతంగా కొనసాగడం అరుదు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ, కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ నిలదొక్కుకున్నాయి. రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక, పార్టీ కమిటీ తర్వాత ఇతర కమిటీల నియామకం ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు.