Hit And Run Case: హైదరాబాద్ మహా నగరంలోని నార్సింగి పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదర్ షాకోట్ చౌరస్తా దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే, హైదర్ షాకోట్ ప్రాంతానికి చెందిన కృష్ణ అనే వ్యక్తిని గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. ఈ సందర్భంగా కృష్ణ కారు చక్రాల కింద నలిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారు ఆపకుండా డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక, స్థానికులు ఆ కారును ఆపేందుకు ప్రయత్నించినా, మితిమీరిన వేగంతో డ్రైవర్ తప్పించుకున్నాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.
ఇక, ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తూ, పారిపోయిన కారును గుర్తించేందుకు విచారణ కొనసాగిస్తున్నారు.