NTV Telugu Site icon

Jagadish Reddy: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీనే..

Jagadish Reddy

Jagadish Reddy

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ ఎమ్మేల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ బీఫాం పై గెలిచి కాంగ్రెస్ లో చేరారని తెలిపారు. వారి సభ్యత్వం రద్దు కావాల్సి ఉందని.. వారిపై పిటిషన్ ఇవ్వాలని స్పీకర్ ను సమయం కోరామని జగదీష్ రెడ్డి తెలిపారు. ఈరోజు లేదా రేపు సమయమిస్తానని స్పీకర్ చెప్పారన్నారు. గతంలో పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు వీరిద్దరి సభ్యత్వాలు రద్దు కావాలని అన్నారు. తనను కలిసి ఈ అంశం గురించి తెలియజేసేందుకు స్పీకర్ సమయం ఇస్తారని భావిస్తున్నామన్నారు. పాంచ్ న్యాయ్ తీర్మానం ప్రకారం ఫిరాయింపులు ప్రోత్సహించవద్దని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెబుతున్నారని జగదీష్ రెడ్డి తెలిపారు.

Read Also: Ismail Haniyeh: హమాస్ చీఫ్ హనియేకి ఎదురుదెబ్బ.. ఇజ్రాయిల్ దాడిలో 10 మంది కుటుంబీలకు మృతి..

రాహుల్ బీజేపీపై దాడి చేస్తుంటే ఇక్కడ రేవంత్ బీజేపీకి తోకలా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. మోడీ విధానాలను రేవంత్ ఫాలో అవుతున్నాడని జగదీష్ రెడ్డి ఆరోపించారు. తాము ఏ ఒక్కరిని వదిలిపెట్టం.. ప్రజల ముందు దోషిగా నిలబెడతామని పేర్కొన్నారు. స్పీకర్ న్యాయంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. మరోవైపు సీఎం రేవంత్ భయంలో ఉన్నాడని.. కాంగ్రెస్ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని జగదీష్ రెడ్డి అన్నారు. పదవిని కాపాడుకోవటానికి ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. రాజశేఖర్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదా? అని జగదీష్ రెడ్డి ప్రస్తావించారు. హైకోర్టు తీర్పు తర్వాతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రావచ్చని తెలిపారు.

Read Also: Pune Porsche case: పూణె కారు ప్రమాదం కేసులో మైనర్‌కు బెయిల్