Egg Price Hike: గుడ్డు.. వెరీ గుడ్ ఫుడ్‌గా చెబుతారు.. ఎన్నో పోషకాలు ఉండే గుడ్డు రోజుకోటి తింటే చాలు అని సూచిస్తున్నారు.. ఇక, డైట్లు, ఎక్సర్‌సైజ్‌లు చేసేవాళ్లు ఎక్కువ మోతాదులో గుడ్లు తీసుకుంటారు.. అయితే, కోడి గుడ్డు ధరలు కాస్తా కొండెక్కి కూర్చున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో గుడ్డు ధరలు రికార్డు బద్దలు కొట్టాయి. రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు 8 రూపాయలు దాటి ధర పలుకుతోంది. నార్త్ ఇండియాకు పెరిగిన ఎగుమతులు, మోoథా తుఫాన్ కారణంగా జరిగిన నష్టం ధరలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
మరోవైపు, కార్తీక మాసం ముగిసిందని మార్కెట్లకు వెళ్లిన నాన్ వెజ్ లవర్స్ కు ఎగ్ స్ట్రోక్ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్లు ధరలు గుట్టు చప్పుడు కాకుండా పెరిగిపోయాయి. రిటైల్ మార్కెట్ ఒక్కో గుడ్డు డిమాండ్ ను బట్టి 8 రూపాయలు అంతకంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. వెజిటబుల్స్ ధరలతో కలవర పడుతుంటే గుడ్డు కూడా గుభేల్ మనిపించడం సామాన్యుడికి భారంగా మారింది. హోల్‌సేల్ మార్కెట్‌లో 100 గుడ్ల ధర రికార్డు స్థాయిలో 673కు చేరింది. దీనికి వివిధ కారణాలను మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర భారతంలో చలితో గుడ్ల వినియోగం బాగా పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి ఎగుమతులు ఊపందుకున్నాయి. ఇటీవల ఏపీ, తెలంగాణలో వ్యాధులతో పెద్ద మొత్తంలో కోళ్లు చనిపోయి గుడ్ల ఉత్పత్తి తగ్గింది. దీంతో కోడి గుడ్ల ధర కొండెక్కిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఉత్పత్తి తగ్గిన కారణంగా వచ్చే కొద్ది రోజులు గుడ్డు ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో రైతు బజార్లలో విక్రయాలపై దృష్టి సారించారు. విశాఖలో 6 రూపాయల 60 పైసలు దగ్గర అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఎగ్, వెజిటబుల్స్ కంటే చికెన్ ధరలే బెటర్ గా ఉన్నాయంటున్నారు వినియోగదారులు. విశాఖలో హోల్ సేల్ మార్కెట్‌లో 100 గుడ్లు 673 రూపాయలుగా పలుకుతుండగా.. రిటైల్ మార్కెట్‌లో అది ఒకటి రూ.7 నుంచి రూ.8 వరకు విక్రయిస్తున్నారట.. ఇక, చిత్తూరు హోల్‌సేల్ మార్కెట్‌లో రూ.635గా.. హైదరాబాద్‌లోనూ 100 గుడ్ల ధర రూ.635గా ఉన్నట్టుగా చెబుతున్నారు.. అయితే, రిటైల్ మార్కెట్‌కు వచ్చే సరికి ఒక్క గుడ్డుకు రూ.6.50 నుంచి రూ.7 వరకు విక్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు..