ప్రముఖ వ్యాపారవేత్త, వైసీపీ నేత పోట్లూరి వరప్రసాద్(పీవీపీ) పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నిన్న ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పీవిపీ అనుచరుడు బాలాజీ మరికొందరితో కలిసి డీకే అరుణ కుమార్తె శృతి రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి, ఆమె స్వంతగా నిర్మించుకున్న ప్రహరి గోడతో పాటు రేకులను సైతం జేసీబితో ధ్వంసం చేయించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా శృతిరెడ్డిని బెదిరింపులకు గురి చేసినట్టు తన ఫిర్యాదులో తెలిపింది. దీంతో పీవిపీతోపాటు సంఘటన స్థలంలో ఉన్న బాలాజీ అతనికి సహకరించిన మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాజాగా శృతిరెడ్డి దూషించిందంటూ పీవీపీ అనుచరులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పీవీపీ అనుచరుల ఫిర్యాదు మేరకు శృతిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీకే అరుణ కుమార్తె శృతి రెడ్డి కావాలనే తమపై కక్ష సాధింపు చర్యలో భాగంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని పీవీపీ అన్నారు. ఇద్దరి మధ్య కంపాండ్ వాల్ నిర్మాణము విషయంలో వివాదం తలెత్తిందని, గతంలో కోర్టు పరిధిలో కేసు ఉందని.. కోర్టు ఆర్డర్‌తో నిర్మాణం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు కోర్టు ఆర్డర్ కాపీ పోలీసులకు అందజేశామని వెల్లడించారు. కావాలనే శృతి రెడ్డి కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ తమను దూషిస్తూ తమపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని పీవీపీ ఆరోపించారు.