Site icon NTV Telugu

KTR: రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్ సభ సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది..

Ktr

Ktr

KTR: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్ సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఓరుగల్లు వేదికగా జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ సైనికులతో పాటు తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్యనేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

Read Also: Seediri Appala Raju: సీఎం శ్రీకాకుళం పర్యటనపై మాజీ మంత్రి అప్పలరాజు కౌంటర్‌ ఎటాక్..

అయితే, ప్రతి గ్రామంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఉదయాన్నే గులాబీ జెండాలు ఆవిష్కరించి కదలి రావాలని కేటీఆర్ సూచించారు. పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక సభ కావడంతో, సభకు హాజరయ్యే వారు గులాబీ రంగు దుస్తులు ధరించి రావాలని కోరారు. రాష్ట్ర నలుమూలల నుంచి సభకు తరలి రావాలనే ఉత్సాహం ప్రజల్లో పెద్ద ఎత్తున కనిపిస్తుంది.. వారందరినీ సమన్వయం చేసుకుని అనుకున్న సమయానికి సభా ప్రాంగణానికి చేరుకునేలా ప్రణాళిక వేసుకోవాలన్నారు. పార్టీ సిల్వర్ జూబ్లీ సభకు తరలి వచ్చే ప్రతి వాహనానికి అన్ని వైపులా గులాబీ జెండాలు కట్టుకుని ఉత్సాహంగా బయలుదేరాలని కేటీఆర్ సూచించారు.

Read Also: Chiranjeevi : మే9న మెగా ఫ్యాన్స్ కు పండగే.. అటు చిరు.. ఇటు చరణ్‌

ఇక, ఎండల వల్ల ఇబ్బంది లేకుండా ప్రతి బస్సులో మంచి నీళ్ల బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, భోజన వసతులకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కిండ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. తెలంగాణ నలువైపుల నుంచి తరలి వచ్చే వాహనాలు ట్రాఫిక్ జామ్ కాకుండా ఇప్పటికే రూట్ మ్యాప్ పంపించాం.. దానికి అనుగుణంగానే ఆయా రూట్లలో సభ స్థలికి చేరుకోవాలన్నారు. సభా ప్రాంగణానికి 30 కిలోమీటర్ల దూరం నుంచి రోడ్లపై ఎక్కడ వాహనాలు నిలపరాదు.. నేరుగా సూచించిన పార్కింగ్ స్థలాలకు చేరుకొని వాహనాలను నిలపాలి.. అనేక ప్రాంతాల్లో పార్టీ వాలంటీర్లు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉంటారని తెలిపారు. చారిత్రక సభలో కేసీఆర్ ప్రసంగంపై అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది.. రాష్ట్ర రాజకీయాల్లో ఈ సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతోందని కేటీఆర్ స్పష్టం చేశారు.

Exit mobile version