Missing Girls: హైదరాబాద్‌లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం

  • దోమలగూడ నుంచి బయటకు వెళ్లిన ముగ్గురు బాలికలు
  • కాచిగూడ రైల్వే స్టేషన్‌లో CCTVలో కనిపించిన దృశ్యాలు
  • ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం
  • సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి
Missing

Missing

Missing Girls: నగరంలోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు మైనర్ బాలికలు ఒకేసారి అదృశ్యం కావడం కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వలస కుటుంబాలకు చెందిన స్నేహ కుమారి, లలిత కుమారి, లత అనే ముగ్గురు బాలికలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇళ్ల నుంచి బయటకు వెళ్లారు. హిమాయత్‌నగర్ మెయిన్ రోడ్డు వద్ద వీరు ఆటో ఎక్కినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ తర్వాత రూట్‌ను ట్రాక్ చేయగా, సదరు బాలికలు కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద ఆటో దిగినట్లు అక్కడి సీసీటీవీ (CCTV) ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిర్ధారించారు.

బాలికలు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు దోమలగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, బాలికల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రైల్వే స్టేషన్ పరిసరాలలోని మరికొన్ని సీసీటీవీ విజువల్స్‌ను విశ్లేషిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ బాలికలకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు పిర్యాదు చేసి సహకరించాలని అధికారులు ప్రజలను విజ్ఞప్తి చేశారు.