హైదరాబాద్ మూసారాంబాగ్ లోని ఓ ప్రింటింగ్ ప్రెస్ లో పోలీసుల సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ఈ ప్రింటింగ్ ప్రెస్‌లో నిషేధిత మావోయిస్టు సాహిత్యం ప్రింట్ చేస్తున్నారన్న సమాచారం లభించింది. దీంతో సోదాలు నిర్వహించారు. మావోయిస్ట్ నేత,ఇటీవల మరణించిన ఆర్కే జీవిత చరిత్రను ప్రింట్ చేస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన డీసీపీ రమేష్ రెడ్డి సోదాలు నిర్వహించారు. నవ్య ప్రింటింగ్ ప్రెస్‌లో ఈ సోదాలు జరిగాయి. పీవోడబ్ల్యూ సంధ్య కు చెందిన నవ్య ప్రింటింగ్ ప్రెస్ లో సోదాలు నిర్వహించారు పోలీసులు. ఈ వార్త తెలిసిన వెంటనే ప్రింటింగ్ ప్రెస్‌కు చేరుకున్నారు సంధ్య.
అంబర్ పేట నవ్య ప్రింటింగ్ ప్రెస్ తమదేనని, అమరుడైన మావోయిస్టు అగ్రనేత ఆర్ కె జీవిత కు సంబంధించిన కొన్ని పుస్తకాలను ప్రచురించాలని ఆర్కే సతీమణి శిరీష తమను కోరడం జరిగిందన్నారు సంధ్య. విరసం నేత పినాకపాణి, పౌరహక్కుల సంఘం నేత సురేష్ తమను సంప్రదించారు. దీనికి సంబంధించిన మ్యాటర్ అంతా పెన్ డ్రైవ్‌లో ఇచ్చారని, దీనికి తన భర్తకు సంబంధం లేదన్నారు సంధ్య. నా ప్రమేయం వల్లనే పుస్తకాలు ప్రచురితమయ్యాయని వివరించారు. ఆర్కే మృతి చెందారు కదా అని తన భర్తకు నేనే తెలియ చెప్పాను వెయిట్ చేయమని. ఇంతలోనే పోలీసులు ప్రింటింగ్ ప్రెస్ లోకి రావడం హంగామా చేశారు. తమ సిబ్బంది మొబైల్ ఫోన్లు లాక్కున్నారని సంధ్య అన్నారు.