Traffic Diversion: ఆస్పత్రి సిబ్బంది, పోలీసులే కాదు చివరకు కేసీఆర్ స్వయంగా తనను చూసేందుకు రావద్దని బీఆర్ఎస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. పూర్తి ఆరోగ్యంతో త్వరలో మీ వద్దకు వస్తాను… ఇప్పట్లో యశోద ఆస్పత్రికి రావద్దని కేసీఆర్ సూచించారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని బయటకు వస్తే ఇన్ ఫెక్షన్ వస్తుందని వైద్యులు చెబుతున్నారని తెలిపారు అంతేకాదు తన కోసం వచ్చేవారు ఉన్నందున ఇతర పేషెంట్స్ కు ఇబ్బందికలిగే అవకాశం ఉందని రావద్దని కేసీఆర్ కోరారు. అయినా కూడా బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానుల తాకిడి యశోద ఆస్పత్రికి తగ్గలేదు. దీంతో చేసేదేమీలేక ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లే రహదారిని ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. ఖైరతాబాద్‌తో పాటు పంజాగుట్ట వైపు నుంచి రాజ్‌భవన్ రోడ్డులోకి ప్రవేశించే ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ విధంగా కేసీఆర్ కోసం యశోద ఆసుపత్రికి వెళ్లే వారినే కాకుండా రాజ్ భవన్ మార్గంలో నిత్యం ప్రయాణించే వారిని సైతం నిలిపివేశారు.
Read also: Cyberabad CP: ట్రాఫిక్ సమస్యపై కొత్తగా ప్రణాళికలు.. రెగ్యులర్ క్రైమ్స్ పై దృష్టి
దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయం లేకుండా ఖైరతాబాద్-పంజాగుట్ట మార్గంలో ప్రయాణించారు. ఈ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తనను చూసేందుకు ఆస్పత్రికి రావద్దని కోరుతూ మంగళవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ వీడియోను విడుదల చేశారు. అయితే సిద్దిపేట, గజ్వేల్‌తో పాటు కేసీఆర్ స్వగ్రామం చింతమడక నుంచి యశోద ఆస్పత్రికి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు వారిని లోనికి అనుమతించకపోవడంతో ఆందోళనకు దిగారు. ఆస్పత్రి ఎదుట బైఠాయించి కేసీఆర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో మిగిలిన రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు పడ్డారు. యశోద ఆస్పత్రి వద్ద కేసీఆర్ అభిమానుల ఆందోళనతో రాజ్‌భవన్ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు రాజ్‌భవన్ రోడ్డును మూసివేశారు. చివరకు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి సిబ్బంది వివరించడంతో మహిళలు శాంతించారు. కేసీఆర్‌ను చూడలేకపోయినా ఆయన ఆరోగ్యంగా ఉన్నారనే వార్త తమకు ఆనందాన్ని ఇచ్చిందని మహిళలు అక్కడి నుంచి వెనుతిరిగారు.
Siddharth: శివ కార్తికేయన్ కోసం ఏలియన్ గా మారిన సిద్ధార్థ్…