Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు మహిళా ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఈ దిశగా మరో ముందడుగు వేస్తూ, మెట్రో అధికారులు ప్రత్యేకంగా మహిళల కోసం “TUTEM” అనే మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. బిట్స్ పిలానీ-హైదరాబాద్, హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL), హైదరాబాద్ పోలీస్, ఐఐటీ ఖరగ్పూర్ , ముంబయికి చెందిన పలు సంస్థలు కలిసి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) సహకారంతో ఈ యాప్‌ను అభివృద్ధి చేశాయి.
ఈ సందర్భంగా మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ, మహిళలు తమ ఇంటి నుండి గమ్యస్థానం వరకు సురక్షితంగా ప్రయాణించేందుకు ఈ టెక్నాలజీ ఆధారిత పరిష్కారం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. “TUTEM” యాప్ మహిళా ప్రయాణికులకు మెరుగైన భద్రతా వాతావరణాన్ని కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యాప్ ద్వారా మహిళలు ప్రయాణ సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే తక్షణ సహాయం పొందవచ్చు. అలాగే, తమ ప్రయాణ వివరాలను విశ్వసనీయ వ్యక్తులతో పంచుకునే అవకాశం కూడా ఉంటుంది. త్వరలోనే ఈ యాప్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. మహిళా ప్రయాణికుల భద్రతకు హైదరాబాద్ మెట్రో తీసుకుంటున్న ఈ చర్యలు ప్రశంసనీయం.