Illegal Egg Donation Case : అండాల అక్రమ దందాలో మరో ట్విస్ట్.. ఒక్కో అండం రూ.3 లక్షలకు విక్రయం

  • ఐదు రోజుల కస్టడీకి పోలీసుల పిటిషన్
  • ముగ్గురు నిందితులపై మరో కేసు
  • 66 మంది మహిళల నుంచి అండాల సేకరణ
  • ఒక్కో అండం రూ.3 లక్షలకు విక్రయం
Egg Donation Case

Egg Donation Case

అక్రమ అండాల సేకరణ, విక్రయాల కేసులో మలక్‌పేట్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇద్దరు నిందితులను ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. సద్గురు హెల్త్ కేర్ బ్రాంచ్ ఇంచార్జ్ ఆనంద్ రాజు, అడ్మిన్ సుభానీ షేక్‌లను మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు తమ కస్టడీ పిటిషన్‌లో పేర్కొన్నారు.

మరో కేసు.. పీటీ వారెంట్ దాఖలు

అండాల కేసులో ప్రధాన నిందితులపై మలక్‌పేట్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. అమిత్ శర్మ, నిఖిత్ పర్వీన్, దుర్గ ప్రసాద్‌లపై ఈ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ఈ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచేందుకు అనుమతి కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పీటీ వారెంట్ సమర్పించారు.

రూ.3 లక్షలకు అమ్మకాలు.. దందా గుట్టు రట్టు

ఈ అక్రమ దందాకు సంబంధించిన కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. 66 మంది మహిళల్లో 47 మంది మహిళల నుంచి అండాలు సేకరించినట్లు దర్యాప్తులో తేలింది. ఇలా అక్రమంగా సేకరించిన అండాలను పిల్లలు లేని దంపతులకు ఒక్కొక్కటి రూ.3 లక్షల చొప్పున విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సద్గురు హెల్త్ కేర్ డైరెక్టర్ గేదెల దుర్గా రావు నేతృత్వంలో ఈ దందా సాగుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు.