ప్రపంచంలోనే హైదరాబాద్ బిర్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దీని వెనుక ఒక కారణం కూడా ఉంది. ఒకప్పుడు నిజాంల ప్రత్యేక వంటకంగా పరిగణించబడిన ఈ బిరియాని ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగానే కాకుండా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో విరివిగా లభిస్తుంది. హైదరాబాదీ బిరియాని అనే పేరు కనిపిస్తే ఇతర రాష్ట్రాల్లోనూ ప్రజలు ఆ రుచిని చూసేందుకు క్యూ కడుతుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ వంటకానికి ఉన్న ఆదరణ ఎంతో ప్రత్యేకం. ఈ ప్రత్యేకత అంతరాష్ట్ర దొంగను కూడా పట్టించిందంటే నమ్ముతారా.. అదెలా అంటే..
కర్ణాటకలోని మైసూర్ హలే కేసరేలో సయ్యద్ ఐజాజ్ ఎలియాస్ ఇమ్రాన్ నివాసముంటున్నాడు. హైదరాబాద్ వచ్చి నగరంలో తాళం వేసిన ఇళ్లను గుర్తించి, తాళం పగులగొట్టి విలువైన నగలు, నగదును దోచుకోవడం వృత్తిగా పెట్టకున్నాడు. అయితే దోచుకున్న నగలు, నగదుతో తిరిగి వెళ్లే సమయంలో అతనికి ఇష్టమైన హైదరాబాద్ బిర్యానీని ఆరగించడం అలవాటు. పలు సందర్భాలలో మలక్పేట సోహైల్ హోటల్ నుంచి జొమాటో ద్వారా మెహదీపట్నంలోని ప్రైవేటు ట్రావెల్స్క బిర్యానీ తెప్పించుకుని, ఆ ట్రావెల్స్ నుంచి బెంగళూరుకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకునేవాడు. అలా చేస్తూ కొంతకాలం గడిపిన ఇమ్రాన్ ఒకరోజు మలక్పేట పరిధిలోని వెంకటాద్రినగర్ కాలనీలో ఇంటికి తాళం వేసి వుండటంతో చోరీకి పాల్పడ్డాడు. అనంతరం మెహదీపట్నంలోని ప్రైవేటు ట్రావెల్స్క బిర్యానీ తెప్పించుకుని ఆ ట్రావెల్స్ నుంచి బెంగళూరుకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకున్నాడు.
అయితే దొంగతనం జరిగిన ఇంటి బాధితుడు సయ్యద్ ఇస్తేకా రుద్దీన్ మే 14న చోరీ జరిగిన సంఘటనను మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చోరీ జరిగిన ఇంటి సమీపంలో నమోదైన మొబైల్ కాల్ డేటాను సేకరించారు. వీటి లావాదేవీలు మొబైల్ నంబర్ ద్వారా జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. కాల్ డేటా ఆధారంగా మలక్ పేట్ క్రైం ఇన్స్పెక్టర్ నానునాయక్ తో కూడిన క్రైం పోలీసుల బృందం బెంగళూరులో నిందితుడు సయ్యద్ ఐజాజ్ ఉన్నట్లుగా గుర్తించి పట్టుకున్నారు. అతడి నుంచి రూ.2.50లక్షలు, 85 గ్రాముల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి నగరంలో జరిగిన తొమ్మిది కేసులతో సంబంధమున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
David Flucker: వందేళ్ల వృద్ధుడు.. కానీ ఇంకా పనిచేస్తున్నాడు..