గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ అధికారులు ఖుషీగా వున్నారు. భాగ్యనగరంలో పేరుకుపోయిన ట్యాక్స్ ల వసూలుకు GHMC ఎర్లీ బర్డ్ ఆఫర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ బంపర్ ఆఫర్ ముగిసింది. దీంతో GHMCకి కాసుల వర్షం కురిసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రాపర్టీ టాక్స్ ఏప్రిల్ నెలలో కట్టిన వారికి 5 శాతం రిబేట్ సౌకర్యం కల్పించింది బల్దియా.
దీంతో ఎగబడి మరి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేశారు నగరవాసులు. ఈ ఆఫర్ కారణంగా జీహెచ్ఎంసీకి భారీగా నిధులు సమకూరాయని అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీగా వసులైన ప్రాపర్టీ ట్యాక్స్ తో ఖజానా గలగల మంటోంది. ఎర్లీ బర్డ్ ఆఫర్ అమలులో వున్న నెల రోజుల్లోనే 742 కోట్ల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు అయినట్టు అధికారులు తెలిపారు. గతేడాది మొత్తం 1495 కోట్ల రూపాయలే వసూలు అయ్యాయి. కానీ, కొత్త ఆర్థికసంవత్సరంలో ఒక్కనెలలోనే రికార్డుస్థాయిలో వసూళ్ళు జరిగినట్టు తెలుస్తోంది.
గతేడాది మొత్తం వసూలైన ప్రాపర్టీ టాక్స్ లో దాదాపు సగం కలెక్షన్ ఈ ఒక్క నెలలోనే వసూలయింది. 600 కోట్లు వసూలు చేయాలని భావించారు అధికారులు. కానీ ఎర్లీ బర్డ్ ఆఫర్ పేరుతో రిబేట్ అందిస్తే స్పందన బాగుంటుందని భావించి ఆ దిశగా అడుగులు వేశారు. అయితే 700 కోట్లు కూడా దాటేయడంతో మరింతగా ఉత్సాహంగా ట్యాక్స్ వసూలు చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న GHMCకి ఈ ఆదాయం భారీగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఎర్లీ బర్డ్ తో వచ్చే ఆదాయాన్ని నగరంలో రోడ్ల నిర్మాణం, నిర్వహణ, ఇతరత్రా పెండింగ్ బిల్లులను క్లియర్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఒక ఐడియా బల్దియాకు కాసుల పంట పండించిందని చెప్పాలి.
Land Dispute : గుంటూరులో భూవివాదానికి రాజకీయరంగు