ఆదివారం సెలవు దినం కావడంతో తెలంగాణ తిరుపతిగా పేరున్న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. హైదరాబాద్ సహా తెలంగాణ ప్రాంతం నుంచి యాదాద్రికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి మొక్కులు తీర్చుకోవడానికి బారులు తీరారు. ఉదయం నుంచీ యాదాద్రి భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. తిరు మాఢవీధులు భక్తులతో నిండి పోయాయి. స్వామి వారి దర్శనం అనంతరం ప్రసాదం కొనుగోలు చేసేందుకు భక్తులు క్యూ కట్టారు. దర్శనం క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Read Also: Typhoon Nanmadol: జపాన్‌ను భయపెడుతున్న తుఫాన్.. 20 లక్షల మంది ప్రజలపై ప్రభావం
యాదాద్రి ఆలయం పునర్ వైభవం తర్వాత భక్తులు అధికసంఖ్యలో తరలివస్తున్నారు. దీనికి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రసాదం కూడా అధిక సంఖ్యలో అందుబాటులో వుంచుతున్నారు. గతంలో కంటే యాదాద్రి అద్భుతంగా తీర్చిదిద్దారు. పునర్నిర్మాణంలో భాగంగా యాదాద్రి ఆలయంలో బాహ్య ప్రాకారంలో తిరు మాఢవీధులతోపాటు తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర పంచతల రాజగోపురాలు, పడమర సప్తతల రాజగోపురంతోపాటు త్రితలం, విమాన గోపురాలను కృష్ణశిలలతో మహాద్భుతంగా తీర్చిదిద్దారు.
గతంలో ప్రాకారాలు లేని ఆలయానికి ఇప్పుడు బాహ్య, అంతర ప్రాకారాలు నిర్మించారు. అష్టభుజి మండపాలతో ప్రధానాలయం కనువిందు చేస్తోంది. స్వామివారికి ప్రత్యేక రథశాల, ఆ పక్కనే లిప్టు, పడమర ప్రాంతంలో తిరుపతి తరహాలో వేంచేపు మండపం, తూర్పు ప్రాంతంలో బ్రహ్మోత్సవ మండపాన్ని నిర్మించారు. గర్భాలయంలో నిలువెత్తు ఆళ్వారులు, స్వర్ణకాంతులతో తీర్చిదిద్దిన ముఖ మండపం భక్తులను ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ కు సమీపంలోనే యాదాద్రి వుండడంతో వీలైనన్ని సార్లు జనం అక్కడికి వెళుతున్నారు. ఇక సెలవు దినాల టైంలో చెప్పక్కర్లేదు. యాదాద్రి కొండపై ఎటుచూసినా జనమే భక్తజనం.
Read Also: PeddiReddy: ప్రభుత్వంపై బురద చల్లడమే టీడీపీకి పని.. వాస్తవాలు తెలుసుకోవాలి