Harish Rao : కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన తాజా నివేదికను మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. గత 20 నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను “గాలికి వదిలేసి” రాజకీయ కక్షలు సాధించేందుకే కమిషన్‌లను ఏర్పాటు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. డబ్బులు దంచుకోవడానికీ, ప్రతిపక్షాలపై కేసులు పెట్టడానికీ ఈ కమిషన్‌లు సాధనంగా మారాయని అన్నారు.
హరీష్ రావు మాట్లాడుతూ, “పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్ట్, బీఆర్ఎస్ రాజతోత్సవ సభ ముందు ఒక రిపోర్ట్, స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇంకో రిపోర్ట్.. ఇవన్నీ కుట్రలో భాగం. మాకు నోటీసులు రాకముందే మీడియాకు లీకులు ఇచ్చారు. 60 పేజీల రిపోర్ట్ కుట్రతో బయట పెట్టారు. అసలు 650 పేజీల రిపోర్ట్‌ను అసెంబ్లీలో పెట్టండి, చీల్చి చెండాడుతాం,” అని అన్నారు.
కమిషన్ ఇచ్చిన నివేదికలో కేంద్ర ప్రభుత్వాన్నే తప్పు పట్టినట్లు ఉందని హరీష్ విమర్శించారు. “కమిషన్ ఒకవైపే విని ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఇది ట్రాష్, బేస్‌లెస్. గతంలో ఇందిరా గాంధీ, చంద్రబాబు మీద వచ్చిన రిపోర్టులు న్యాయస్థానాల్లో నిలబడలేదు. ఇవి కూడా నిలబడవు,” అన్నారు.
Ukraine: రష్యాలో పాక్, చైనా కిరాయి సైనికులు.. జెలెన్‌స్కీ ఆరోపణలు
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయని అని హరీష్ స్పష్టం చేశారు. “కేసీఆర్‌ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నారు. కానీ నిజం ఏమిటంటే, సర్ ఆర్థర్ కాటన్‌ను ఎలా పూజిస్తారో, భవిష్యత్తులో కేసీఆర్‌ను కూడా అలాగే పూజిస్తారు. సీఎం రేవంత్‌కీ ఇది తెలుసు. అందుకే మొన్న గంధమల్ల ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టాడు,” అని అన్నారు.
తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు పెట్టడమే కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు అని హరీష్ ఆరోపించారు. “ఆ నిర్ణయాన్ని మార్చి మెడిగడ్డకు తీసుకెళ్లిన విషయాన్ని సీడబ్ల్యూసీ కూడా ఆమోదించింది. కాళేశ్వరం డిపిఆర్‌లో అన్నీ క్లియర్‌గా చెప్పాం. నీళ్లు లేక మార్పులు చేయాల్సి వస్తుందని బహిరంగంగానే ప్రకటించాం. కేబినెట్ నిర్ణయం ప్రకారమే ఇది జరిగింది. 2016 జూన్ 3న కేబినెట్ ఆమోదించింది,” అని గుర్తు చేశారు.
అసెంబ్లీలో ఈ అంశంపై పూర్తి వివరణ ఇస్తామని హరీష్ సవాల్ విసిరారు. “మీకు దమ్ముంటే మైక్ కట్ చేయకుండా మాట్లాడనివ్వాలి. ఆధారాలతోనే చర్చిస్తాం. ఇవాళ కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నట్లుగా ఆరోపణలు చేస్తున్నారు. తెలిస్తే ఇంకా ఆధారాలు సేకరించేవాళ్లం,” అని వ్యాఖ్యానించారు. “ఈ నివేదికలు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే, రాజకీయ కక్షలు తీర్చుకోవడానికే,” అని హరీష్ తేల్చి చెప్పారు.
Viral News: అంబానీ కంటే ధనవంతురాలిగా మారిన చనిపోయిన మహిళా.. అకౌంట్లోకి 1.13 లక్షల కోట్లు జమ!