ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో ఆప్ కి చెందిన సీనియర్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్రజైన్, సోమనాథ్ భారతి వంటి హేమా హేమీలు బీజేపీ అభ్యర్థుల చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఇక, కాంగ్రెస్ సంగతి సరే సరి. పోస్టల్ బ్యాలెట్ లోనే నోటాతో పోటీ పడుతూ ఓట్లు రాబట్టింది కాంగ్రెస్. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. అయితే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డు మిగిలిందని సెటైర్లు వేశారు.
Also Read : Parvesh Sahib Singh: మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ.. తొలి ట్వీట్ వైరల్
ఇక, మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీలో ఘోర పరాజయం చెందడంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గార్ల పాత్ర అమోఘం అని హరీష్ రావు చలోక్తులు విసిరారు. ఇక్కడ హామీలు అమలు చేయకుండా, ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకున్నంత మాత్రాన మీకు ఓట్లు పడతాయా? మీ గ్యారెంటీల నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైంది. ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆగమాగం చేసిన కులగణన మీకు బెడిసికొట్టింది. ఇప్పటికైనా తప్పులు ఒప్పుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పి కులగణను మళ్ళీ నిర్వహించండి. అన్ని కులాలకు సమన్యాయం జరిగేలా చూడండి. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసి అప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేసుకోండి రేవంత్ రెడ్డి గారూ.. లేదంటే మీరు ఎక్కడ అడుగుపెట్టినా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లోనూ మీకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు అని హరీశ్ రావు అన్నారు.