సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు కేంద్రంను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగిలో పండిన పంటను, ఒక గింజ కూడా కొనలేము అని ఎఫ్‌సీఐ, కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంకు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన సహకారం రావడం లేదని, ఎఫ్‌సీఐ ఎప్పటికప్పుడు వడ్లు తీసుకోకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
ఢిల్లీలోని ప్రభుత్వం వడ్ల కొనుగోలు పై మొండివైఖరి గా వ్యవహరిస్తుందని, ముఖ్యమంత్రి ఢిల్లీ కి మూడు సార్లు వెళ్లి వడ్లు కొనుగోలు పై చర్చించినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వెళుతోందని, కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 24 గంటల కరెంటు ఇస్తే, కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు విషయంలో అడ్డు పడుతోందని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర బీజేపీ నాయకులు, రాష్ట్రంలో మాట్లాడడం కాదు.. ఢిల్లీ కి వెళ్లి, యాసంగి లో వేసే పంటలు కూడా కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఇక్కడ నోరు పారేసుకోవటం కాదు, తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే ఢిల్లీ వెళ్లి అక్కడి నాయకులతో మాట్లాడాలని, యాసంగిలో పండే పంటను కూడా కొనుగోలు చేసేలా ఒత్తిడి తేవాలన్నారు.