Harish Rao : కేసీఆర్ రాజీనామా డైవర్షన్ పాలిటిక్స్..

  • కేసీఆర్ రాజీనామా డిమాండ్‌పై హరీశ్ ఫైర్
  • ‘రేవంత్ పిల్ల చేష్టలతో ప్రజలను మభ్యపెట్టలేరు’
  • సిద్దిపేట దండయాత్రపై తీవ్ర విమర్శలు
  • అసెంబ్లీలో కాంగ్రెస్‌ను నిలదీస్తాం
Harish

Harish

కేసీఆర్ రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. NTVతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. సీఎం తన తప్పిదాలు బయటకు రాకుండా ఉండేందుకే కేసీఆర్ రాజీనామా అంశాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. ప్రజలు రేవంత్ రెడ్డినే రాజీనామా చేయాలని కోరుతున్నారని, వారి దృష్టిని మరల్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని అన్నారు.

రేవంత్ రెడ్డి పిల్ల చేష్టలు చేస్తున్నారని హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చిల్లర రాజకీయాలతో ప్రజల దృష్టిని మరల్చలేరని అన్నారు. సిద్దిపేటలో దండయాత్ర చేస్తానంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. దండయాత్రలు కబ్జా చేయడానికి వస్తారని విమర్శించారు. గతంలో రెండుసార్లు సిద్దిపేటకు వచ్చిన రేవంత్ రెడ్డి ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తలకిందులుగా నిలబడినా, పొర్లు దండాలు పెట్టినా సిద్దిపేట ప్రజలు రేవంత్ రెడ్డిని నమ్మరని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.

రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్ని అంశాలపై నిలదీస్తామని హరీశ్ రావు తెలిపారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి.. వెయ్యి రోజులు గడిచినా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. రైతులు, మహిళలు, విద్యార్థులకు ప్రభుత్వం చేసిన అన్యాయాలను సభలో ప్రస్తావిస్తామని చెప్పారు. అసెంబ్లీలో 22ఏ అంశంపైనా బీఆర్‌ఎస్ తరఫున గట్టిగా పోరాడతామని హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను సభ వేదికగా ఎండగడతామని తెలిపారు. కేసీఆర్‌పై విమర్శలతో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నాలు ఫలించవని ఆయన అన్నారు.