Site icon NTV Telugu

Harish Rao : రేపు అసెంబ్లీకి కేసీఆర్.. హరీష్ రావు క్లారిటీ..!

Harish Rao

Harish Rao

Harish Rao : రేపటి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న సస్పెన్స్‌కు మాజీ మంత్రి హరీష్ రావు తెరదించారు. ఆదివారం జరిగిన ఒక చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ, రేపటి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటారని అధికారికంగా స్పష్టం చేశారు. కేసీఆర్ రాకతో సభలో ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడుతామని ఆయన తెలిపారు.

కాంగ్రెస్‌కు అసెంబ్లీ అంటే వణుకు: అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీని నిర్వహించాలంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో సగటున ఏడాదికి 32 రోజుల పాటు సభను నడిపేవారమని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ సగటును 20 రోజులకు తగ్గించిందని విమర్శించారు. ప్రజా సమస్యలు చర్చకు వస్తాయనే భయంతోనే సమావేశాల కాలాన్ని ప్రభుత్వం కుదిస్తోందని ఆయన ఆరోపించారు.

తొలిసారిగా హౌస్ కమిటీలు లేవు: శాసనసభ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా, ప్రస్తుత ప్రభుత్వం హౌస్ కమిటీలను నియమించకుండా కాలయాపన చేస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయాల్సిన 18 కమిటీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. అలాగే, తాము చర్చించాలని కోరుతూ ఎన్నో లేఖలు రాసినా, ఒక్క అంశాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మైకులు కట్ చేయడం, మంత్రులు అడ్డుపడటం వంటివి ప్రజాస్వామ్యానికి విఘాతమని పేర్కొన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం: ప్రస్తుత సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఐదు లక్షల కోట్ల కుంభకోణంగా తాము భావిస్తున్న నూతన హెల్త్ పాలసీపై సభలో లోతైన చర్చ జరగాలని కోరారు. అలాగే, గురుకుల పాఠశాలల్లో వరుసగా జరుగుతున్న విద్యార్థుల మరణాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఏ అంశంపై చర్చకు సిద్ధమైనా తాము కూడా అన్ని ఆధారాలతో సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు స్పష్టం చేశారు.

Suvendu Adhikari: ఇజ్రాయిల్ గాజాలో చేసినట్లే, బంగ్లాదేశ్‌కు గుణపాఠం చెప్పాలి..

Exit mobile version